ఎవరికి వారు రామకృష్ణ "కరుణా నా మొబైల్ ఎక్కడుంది, ఆఫీసుకు టైమవుతోంది" గదిలో ప్రతిచోటా వెతుకుతూ విసుగ్గా అరిచాడు ప్రవీణ్. "నా మొబైలే ఎప్పుడు ఎక్కడ పెడతారో గుర్తుండిచావదూ, మీరెక్కడ పెడతారో నాకెలా తెలుస్తుంది" విసుగ్గా, వెటకారంగా సమాధానం చెప్పింది కరుణ. "ఇలా వచ్చి వెతకొచ్చుగా” విసుగ్గా అన్నాడు. "ఇదిగోనండి, చంటోడికి అన్నం తినిపిస్తున్నాను, అయ్యో నా మతి మండిపోను, ఇలా రండి, చూడండి మీ ఫోన్లో చంటోడు ఎంచక్కా కార్టూన్లు చూస్తున్నాడో” అంటూ ఫక్కున నవ్వుతూ ఆనందపడింది. ప్రవీణ్ చిరాకుపడుతూ వచ్చి కొడుకు చేతిలోని చరవాణిని లాక్కున్నాడు విసురుగా. "నీ మొబైల్ ఇవ్వు, నాదే దొరికిందా?” చిరాకుపడుతూ వెళ్ళిపోతుంటే “నాదే, డొక్కు ఫోన్. నా ఫ్రెండ్సంతా ఎగతాళి చేస్తున్నారు, మీవారు హైటెక్ సిటీలో ఆన్ మొబైల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారంటావ్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్మార్ట్ ఫోన్ తెచ్చి ఇవ్వలేకపోయారు. అంటూ ఎగతాళి చేస్తున్నారు”. సరియైన సమయం చూసుకుని తెలివిగా సమాధానమిచ్చాననుకుంది. "అలాగేలేవే, టైమొచ్చినప్పుడు నీకు నచ్చింది కొంటానులే, ముందు వాడి సంగతి చూడు, ఎప్పుడు చూసినా ఫోన్ ఒళ్ళో పెట్టుకుంటేగాని ముద్ద దిగదు, బాగా నేర్పించావ్”, విసుగ్గా రెండు చీవాట్లు పెట్టే ఆఫీసుకు బయలుదేరి వెళ్ళాడు. కరుణ ఆలోచనలో పడింది. ఏంటో, మొబైల్ లేకపోతే నిమషం గడవదు. పుట్టింటి వాళ్ళనడిగితే మీవారు ఆ మాత్రం కొనలేరు అంటారు. ఉదయం మొబైల్ ఒక చేత్తో పట్టుకుని పాలవాడు పాలు పోస్తాడు పని అమ్మాయి మాటిమాటికి మొబైల్ లో మాట్లాడుతూనే అంట్లు తోముతోంది. చివరికి = త్తలు ఊడ్చేవాడు, రోడ్డు మీద బిచ్చగాడు, చరవాణిలో బిజీగా కనిపిస్తాడు. కొత్త మొబైల్ కొనివ్వకపోతే ప్రవీణ్ని పక్కలోనికి కరుణించకూడదన్నంత పౌరుషంతో, పట్టుదలతో వేచి చూడసాగింది కరుణ.................... |