ప్రథమ ఖండం
సూర్యావతరణ ప్రచురణార్థ సం
భృత శంఖమన మింట వేగుసమయ చుక్క వెలింగె.
ప్రాచీసతీ ముఖాబ్జమ్ము పైన సుఖప్ర
సూత్యనంతర వికాసోల్బణత భాసించె.
తుంగభద్రా జలతరంగ డోలల నూగు
బుడుత గాడుపుల సవ్వడులు దవ్వుల వీచె.
ప్రత్యూష పవనమాలల నెయ్య మందికొని
గోక్షీర పరిమళాంకురములు తరలి వచ్చె.
సంఘృష్ట కాంతి నిర్జర విఘాతములతో
చిట్టి పోయినవి చీకట్ల కూకటివ్రేళ్ళు.
రేఖాకృతులుగా చీలిన యెర్రడాళ్ళు క
న్నడెను నెత్తుట తడిసినట్టి బల్లెములట్లు.