పాట, మాట
ఇవి నారెండు కళ్ళు. మాట పాటై మోగాలని, పాట మాటై
నిలిచిపోవాలని నా తపన. అందుకే అన్నాను ఆమధ్య జరిగిన నా షష్టిపూర్తి ఉత్సవంలో
"మాటకు దండం పెడతా పాటకు దండం పెడతా.
మాటను పాటను నమ్మిన మనిషికి దండం పెడతా" అని.
అప్పుడెప్పుడో 1963 ప్రాంతంలో గుంటూరులో జరిగిన పౌర సన్మానసభలో మరింత సూటిగా అన్నాను -
"ఎన్ని తెన్నుల కైతకన్నె విహరించినను
పాటలోనే నాదు ప్రాణాలు గలవందు" అని.
రకరకాల మాత్రా ఛందోగతుల్లో వివిధ వచనకవితారీతుల్లో ఎన్నో కావ్యాలు రాసినా కవితారంగంలో పాటకే నేను వేసే పెద్ద పీట. అందుకే కదా అన్నాను 'పాటలోనే నా ప్రాణాలున్నా'యని.
అందాకా యెందుకు? భారతీయ జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న సభలో చేసిన నా ప్రసంగంలో పాటకూ మాటకూ వున్న అనుబంధాన్ని మరింత స్పష్టంగా చెప్పాను - "పల్లె నాకు పాటనిచ్చింది; పట్నం నాకు మాటనిచ్చింది" అని,
ఇదేమిటి? ముందుగా మాటాలు నేర్చుకున్న తరువాతే కదా పాట. నిజమే: అది వ్యావహారిక సత్యం. నా పరిస్థితి ప్రత్యేకమైంది. తెలంగాణంలో కరీంనగరం జిల్లా వేములవాడ మండలంలోని హనుమాజిపేట నేను పుట్టినూరు. నేను పుట్టి పెరిగిన కాలం నిజాం సర్కారు ఏలుబడిలోనిది. ఆ ఏలుబడిలో ఉండడమే కాదు నేను బడిలో చదువుకున్నది కూడా ఉర్దూ మీడియంలోనే. బడి అంటే ప్రాథమిక పాఠశాల అనుకుంటారేమో; హైస్కూలు చదువు, ఆ తరువాత స్వతంత్ర భారతంలో 1952 వ సం॥వరకు బి.ఏ. చదువు కూడా ఉర్దూ మీడియంలోనే. ఈ పరిస్థితుల్లో మా ఇంట్లో, మా ఉల్లో - ఇంచుమించుగా ఇంటర్మిడియట్ వరకు నేను మాట్లాడింది కరీంనగరం జిల్లా................