ఆమోదం
- డా. కొత్తపల్లి వీరభద్రరావు
"అమృతం పంచి పెడుతున్నాను
అందరూ రండి.'
(“మరో హరివిల్లు" లో శ్రీ నారాయణరెడ్డి) ఇంచుమించుగా ఇరవై యేళ్ళనుంచి డా. నారాయణరెడ్డిగారి
కవిత్వాన్నీ, పదిహేనేళ్ళనుంచి ఆయన్నీ ఎరుగుదును నేను.
కవిత్వాన్ని చదివిన మొదటిరోజులలో 'మనిషి ఎలా ఉంటాడో'
అనుకొనేవాణ్ణి. మనిషిని కలుసుకొన్న తరువాత, ఇంత అమృతహృదయుడు కాబట్టే కవిత్వంద్వారా నిర్జరత్వాన్ని సాధించాడు” అనుకొన్నాను.
నారాయణరెడ్డిగారిని గాని, ఆయన కవిత్వాన్నిగాని కొత్తగా "ఆంధ్రావళి” కి పరిచయం చెయ్యవలసిన అవసరం ఏమీలేదు. ఆయన్ని ఎరగనివాడు ఎవడేనా ఉంటే ఎక్కడేనా ద్వీపాంతరంలో ఉన్నాడేమో! ఆయన కవిత్వాన్ని చదవని తెలుగువాడు తెలుగు చదవని తెలుగువాడు.
మరి, ఇప్పుడిది నేను వ్రాయడానికి కారణం? మా అనుబంధం, పరస్పర ఆదరాభిమానాలు. నాకు ఆయన ప్రతిభమీద ఉన్న గౌరవం. కవిత్వం మీద ఉన్న ప్రీతి. ప్రస్తుత కావ్యసంపుటి 'మంటలూ మానవుడూ' నన్నెలా ఆకర్షించిందో నలుగురికీ చెప్పడం................