బాల్యO
పుట్టిన ఊరు
హొసూరు గౌరీబిదనూరు తాలూకాలోని ఒక గ్రామం. ఇది ఒక హోబళి కేంద్రం. (కర్నాటకలో కొన్ని పల్లెల సమూహాన్ని హోబళి (Revenue Block) అంటారు) గౌరిబిదనూరు - మధుగిరి మార్గంలో గౌరీబిదనూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది పుట్టినప్పుడు కొత్త ఊరు (హొస ఊరు)గా ఉండేది. ఇప్పుడు చాలా పాత ఊరుగా మారింది. ఆ గ్రామంలో సుమారు 1500 గృహాలు. 7500 కన్నా ఎక్కువ జనాభా. గ్రామంలోని రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ మన దేశపు సాంప్రదాయంలా అంతా అస్తవ్యస్తంగా ఉంది. గృహ నిర్మాణం కూడా అంతే. ఎక్కడ చోటు కనిపిస్తే అక్కడో ఇల్లు కట్టేయడమే. ఎక్కడా ప్రణాళిక లేదు. పద్ధతీ లేదు.
అన్ని చోట్లా ఉన్నట్లే ఇక్కడా ఒక హరిజనవాడ - షెడ్యూలు కులాలవారి వాడ. ఊరి చివరలో 'ఎడమ చేతి' వారికొక వాడ, 'కుడి చేతి'వారికి మరొక వాడ. ఒక్కొక్క దానిలో సుమారు 100 ఇళ్లు. ఇవన్నీ జనాలతో పొంగి పొర్లుతున్న కుటుంబాలు. 'కుడి', 'ఎడమ' వారికి ప్రత్యేకమైన బావులు, గుళ్ళూ, ఒకరి బావి మరొకరు ఉపయోగించడానికి పనికిరాదు. గుడులు కూడా అంతే. ఈ 'కుడి' 'ఎడమ'ల మధ్య వి వివాహాలు, విందులూ నిషిద్ధం. 'కుడి' చేతివారు 'ఎడమ చేతి వారికంటె శ్రేష్ఠమనే ప్రతీతి మొదటి నుంచే ఉంది. ఊరిలో బలిజకులం వారి ఇళ్ళు 200కు పైగా ఉన్నాయి. 'నాయక్'ల ఇళ్ళు 150, బ్రాహ్మణుల ఇళ్ళు 15-20 ఉన్నాయి. వైశ్యుల ఇళ్ళు 20 నుండి 40 దాకా ఉన్నాయి. ఒక్కలిగి, కుమ్మర, మరాఠీలు మిగిలిన ముఖ్యమైన జాతులు. 10-20 ముసల్మాన్ల ఇళ్ళూ ఉన్నాయి. ఊరిలో బీదవాళ్ళే ఎక్కువమంది. ఎక్కడో కొంతమంది మాత్రమే మధ్య తరగతివారు. ఒకరో ఇద్దరో శ్రీమంతులు కూడా ఉన్నారు. అధికులకు తెలుగు మాతృభాష. మిగిలిన వారికందరికీ కన్నడ భాష బాగా తెలుసు.....................