నా కవితా శిల్ప సౌందర్యం
నేను చిన్నప్పటి నుండి కవిత్వం అంటే ఎంతో ఇష్టపడతాను. మొదట నేను బైబిల్లోని పరమగీతాలు ఇష్టపడతాను. ఏలియా గారు అనే గొప్ప బోధకుడు చీరాల సముద్రం ఒడ్డున నేను 8వ తరగతి చదువుతున్న రోజుల్లో (1967లో) పరమ గీతాలు గురించి గొప్పగా వర్ణించారు. పరమ గీతాల్లో చాలా కవిత్వం వుంది. ఏ విషయం అయినా కవిత్వపరంగా చెబితేనే అది మెదడుల్లోకి, హృదయాల్లోకి వెళుతుందని అప్పుడే నాకర్ధమయింది. అప్పుడే నేను క్రైస్తవ గీతాలు రాస్తున్నాను. నా పాటకు గుర్రాల ప్రభన్న బాణీలు కట్టేవాడు.
అప్పటికే నా పాటలు చీరాల చర్చిలో మారుమ్రోగుతున్నాయి. నా పాటల రచనలలో చిన్నప్పటి నుండే ఒక శృతి వుండేది. ఈ శృతి మా అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మల నలుగు పాట నుండి వచ్చింది. ఈ శృతిలోనే నేను మా అన్నయ్య పెళ్లి సందర్భంగా ఒక పాట రాశాను.
"సంతోష సుమ సరులు విరియా / సునాద నవనాదములూ కురియా / దంపతుల పొంతలో వింత కాంతులూ మెరియా/ కుసుమంబై సతి విరబూయ / పరిమళమైన పతి ప్రసరించు/ ఆగాలులలో తేలిపోవాలి/మిల మిల లాడుతూ దాంపత్యం"
ఈ పాట పల్లెటూరులో ఒక ఊపు ఊపింది. అప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఏమిటంటే ఈ పాటలు ఈయనే రాశాడా అనేవాళ్ళు. వయసులో రాయడం గురించి ఆశ్చర్యపడేవాళ్లు. పాట రాసేటప్పుడు.......................