ముందుమాట :
"అందమైన వెన్నెల..." లాంటి కథలు
రసరాజు గారు గొప్ప భావుకుడు..
పరిమళించే పద్య కవి. రస భారతి, రస కలశం, వేదిక, విజయభారతం, ద్వారతోరణం, మేఘరంజని లాంటి పద్య కావ్యాల సృష్టికర్త. పలు చలనచిత్రాలకు మధుర గీతాలు రాసిన ప్రసిద్ధ సినీగేయ కవి.. ఇంకా గజల్లు, మినీ కవితలు, రూపకాలు లాంటి సాహితీ ప్రక్రియలు అన్నిటిలోనూ శిఖరప్రాయుడు..
అంతేనా.. ప్రముఖ వార మాస పత్రికలు అన్నిట్లో రసోద్దీపన కలిగించే కథలు ఎన్నో రాసి బహుమతులు' గెలుచుకున్న మేటి కథకుడు కూడా!
ఇదిగో ఇప్పుడు..
"ఈ గులాబీకి ముళ్లు లేవు" అంటూ తన తొలి కథాసంపుటితో.. అందమైన వెన్నెల లాంటి" కథలతో మిమ్మల్ని అలరించబోతున్నాడీ కవితాత్మక కథకుడు!
కథానిక ప్రక్రియ కష్టతరమైనది. "సంఘటనాత్మక వర్ణచిత్రం" అన్నారు శ్రీ పోరంకి దక్షిణామూర్తి..
కథానిక రాయడం ఒక తపస్సు లాంటిది అంటారు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ.. అయినా కథ ఎవరు రాసినా ఎలా రాసినా అది పాఠకుడిని కదిలించాలి.. స్పందింప చేయగలగాలి.. ఒక రసానందం కలిగించాలి.. ఆ రసానందంలో ఒక కొత్త ఆలోచనకు నాంది పలకాలి.. ఆ కొత్త ఆలోచన మానవత్వానికి పరిపుష్టం కలిగించాలి. పరిపుష్టమైన ఆ మానవతా విలువలు సమాజాహితమై లోక కల్యాణార్ధమై వర్ధిల్లాలి.. కథ లేక కథానిక పరమార్ధం ఇంత ఉంది.....................