మనవి మాటలు
- మోదుగుల రవికృష్ణ
పగటి ప్రయాణం. బాపట్ల నుండి తిరుపతికి. నట్టనడి గ్రీష్మం, మే నెల. అయినా తుఫాను ప్రభావం (1990లో) యింకా తొలగిపోక వాతావరణం ఆహ్లాదంగా ఉండింది.
పాసెంజర్ బండి మరీ తొక్కిడిగా లేదు. సందు చేసుకొని కూచొనే తావూ లేదు. చీరాల వచ్చింది. నలుగురు దిగారు, నలభైమంది దిగినంత రభస చేస్తూ కిటికీ సీటు దొరికింది. కూచున్నాను. ఎదుట కూచున్నాయనకి చూడ్డానికి 60 యేళ్లలాగా ఉన్నా మంచి బలశాలి రూపం. పెరిగిన గడ్డం. అయినా శుభ్రంగా వున్నాడు. కథారచయిత పూసపాటి కృష్ణంరాజులాగా ఉన్నాడు. కళ్లు మూసుకొని జోగుతున్నాడు. కునికిపాట్లకి పూర్వం పుస్తకం చదువుతున్నాడు కాబోలు. పుస్తకం మధ్యలో వేలు అలానే వుంది.
జనం దిగే సవ్వడి ఆయనకి మెలకువ కలిగించింది. ఒక్క నిముషం తాళి పుస్తకం తెరచి కొంచెం పెద్దగా చదవడం - కాదు, కాదు - రాగధోరణిగా పాడటం మొదలుపెట్టాడు. అప్పటికే నేను చదవటం ప్రారంభించాను, కాశీమజిలీకథలు 2వ భాగాన్ని. ఆయన పఠనం వలన నా చదువు సరిగా సాగకపోవటంతో విసుగ్గా పుస్తకం మూసి ఆయన సొద వినడం మొదలెట్టాను.
ఆయనది మంచి కంఠం. సంగీతం తెలిసినవాడు కాబోలు. గొంతులో కొద్దిగా ఒణుకు ఉంది. అయినా బాగుంది. అప్పుడు విన్న పంక్తులు పెద్దగా గుర్తులేవు. పదాలు కొన్ని గుర్తున్నాయి. వరమనోహర పంచమస్వరముతో కోకిలను పాడమనడం, ప్రణయ రథం, ఉద్యానవనం - ఇలాంటి మాటలు గుర్తున్నాయి.
రెండు పంక్తులను మాత్రం చాలా గొప్పగా పాడాడు.
నిదానంగా పాడాడు. అయిపోతుందేమో అన్నట్లు నింపాదిగా పాడాడు..............................