నా యెర్రగబ్బిలాలు ఎలా పెరిగాయంటే
నిజమైన చీకటిని నేనెప్పుడు చూడలేదు, ఆ చీకటిని నేనెపుడు అనుభవించలేదు. అసలు చీకట్లో ఏముంటుంది? చీకటి నిజమైన రంగు, చీకటి రూపము, చీకట్లో వాన, చీకట్లో వాసన, చీకట్లో సంచారము, చీకట్లో వేట, చీకట్లో భూమి కదలిక, చీకట్లో సముద్రం, ప్రళయం ఇవన్నీ ఎవరైనా చూసారా? అర్ధరాత్రి అడవి మధ్యలో చీకట్లో కూర్చొని కళ్ళు తెరిచి చూస్తే ఏమి కనపడుతుంది? కళ్లుండి కూడా అసలయిన చీకటిని నేనెప్పుడు చూడలేదు ఎందుకు? నా వూహలు నాలా కాదు, చీకట్లో బాసిపట్లు వేసుకు కూర్చొని అక్కడ దేన్నో వెతుకుతాయి. వెలుగుకి పూర్తిగా అలవాటు పడిపోయిన నాకు చీకట్లో రంగులను దాన్లో కొన్ని రూపాలను రంగస్థలం పై నిలబెట్టినట్టు చూపిస్తాయ్. ఈ నవల్లో చీకటి నా వూహాలు చూపించినవే.
ఎపుడో, ఎక్కడో, ఏదో ఒక రోజు ఒక ఆలోచనో, ఒక కలో, విన్న సంగతో, ఒక మనిషి జీవితమో, ఒక ఆచారమో, ఒక గుడ్డినమ్మకమో, గుండెధైర్యమో మెదడులో ఏదో ఒక మూలన గోల చేయకుండా గడ్డకట్టుకపోయి వుంటాయి. నేను రాయబోయే ప్రతి కథకి అలాంటి గడ్డ కట్టుకపోయిన సంఘటనలన్నీ ఆడిషన్స్ ఇస్తున్నట్టుగా నా ముందుకు వస్తాయి. నన్ను తీసుకో, నన్ను తీసుకో అని. ఒకటి రెండు ఉపయోగపడతాయి ప్రతి కథకి. మిగిలినవన్నీ మళ్ళీ మూలకెళుతాయి. కొన్ని సంఘటనలు, రాస్తున్న కథకు దూరంగా నుంచోని మన వైపే చూస్తూ మనం దాని వైపు కథను తీసుకెళ్లేలా కవ్విస్తూ వుంటాయి. అనుకున్న కథలో అనుకోకుండా చేరి మార్గం మరల్చి చేరాల్సిన ప్రదేశాన్ని అనుకోని దారి ద్వారా తీసుకెళ్తాయి. ఆ ప్రయాణంలో నేను ఒక్కోసారి కథ రాస్తాను, ఒక్కోసారి కథ నా చేత రాయించబడుతుంది. కథ నన్ను రాస్తుంది. అదిగో నన్ను రాసిన నవల ఈ యెగబ్బిలాల వేట. ఇది కొన్ని సంవత్సరాలు నాతోనే వుండి నాతోనే పెరిగిన కొన్ని ఆలోచనలకు ఆకారం.............