ఇందులో లేనిది ఏముంది?
ధర్మే చార్ధ కామేచ
మోక్షేచ భరతవర్ష
యదిహాస్తి తదన్యత్ర
యన్నే హా స్తిన తత్క్వచిత్ !!
మానవజాతి మహేతిహాసంగా మహాభారతాన్ని అందించిన వ్యాసమునిచంద్రుడు దేశ, కాల, జాతి, మత భేదాలు లేకుండా నిఖిల మానవ కళ్యాణ దృష్టితో పండిత, పామర, బాల, వృద్ధ రంజకమైన కథచెపుతూ, దానిలో, ధర్మ, అర్ధ, కామ, మోక్షాలనే పురుషార్ధాలు నిక్షిప్తం చేశాడు.
ఈ పురుషార్ధాలను సంపూర్ణంగా భారత సంహితలో పొందుపరిచాననీ, ఇందులో లేనిది లేదని దీనిలో ఉన్నదే ఎక్కడయినా, ఎప్పుడయినా ఉంటుందనీ ఘోషించాడు. ఇంతమాట అంతకుముందు పలికినవారు లేరు. ఆ తరువాత వారికి పలకగల సత్తాలేదు.
మానవుడు ఏ దేశంలో పుట్టినా, ఏ జాతి సంప్రదాయాన్ని అనుసరించినా, ఏ మతానికి తలవంచిన ధర్మార్ధ కామ మోక్షాలేవానిని మానవునిగా నిలుపుతాయి.
ఇందులో ధర్మ, మోక్ష కవచ బంధితములై అర్ధకామాలు సాధించాలనే భారతీయ దార్శనికులతో నిఖిల దేశాల మేధావులు ఏకీభవించారు. ఈ మార్గాన్ని కథాబద్ధంచేసి, ధర్మ మోక్షాలను ప్రబోధించే ప్రథమ ప్రబంధం భారతం.
ధర్మ మార్గాన అర్ధ సముపార్జనం చేసి, ధర్మబద్ధంగా కామసేవనం సాగించేవారికి మోక్షం అరచేతి అరటిపండు అయి తీరుతుందని భారతం ప్రవచించింది.
అయితే ధర్మ, మోక్ష విషయాలను అందించడానికి శృతి, స్మృతులూ, తత్వ శాస్త్రాలూ వున్నాయి. అర్ధ కామ ప్రతిపాదనకే మరో గ్రంథం అవసరం అయింది. అందుకే భారతం అవతరించింది.............