కాలింగ్ బెల్ అదేపనిగా మోగుతోంది. కళ్ళు తెరవలేకపోతున్నాడు. ముందురాత్రి కంటిమీద కునుకు లేదు. మిత్రుడి పెళ్ళికి వెళ్లాడు. అర్ధరాత్రి ముహూర్తం, పెళ్ళి పూర్తయ్యి ఇంటికి వచ్చేసరికి ఉదయం ఆరయ్యింది. టైము ఎంత అయ్యిందో? గదిలో లైట్లు ఆర్పేయడంతో, కర్టెన్లు కిటికీని కప్పేయడంతో గోడమీద గడియారంలో టైమెంతో తెలియటం లేదు. బలవంతంగా కళ్ళు తెరిచి మంచం దిగాడు.
కర్టెన్ లాగి, కిటికీ తెరిచేసరికి గదిలో వెలుగు పరుచుకుంది. మధ్యాహ్నం నాలుగయ్యింది అనుకున్నాడు గోడ గడియారం చూసి. తను ఒంటిగంటకు భోంచేసి పడుకున్నాడు. ఎవరన్నా డిస్టర్బ్ చేస్తారేమోనని సెల్ ఆపేశాడు. ఇంకా కాలింగ్ బెల్ మోగుతూనే ఉంది. మెల్లగా తలుపు తీశాడు. తన ఎదురుగా కాకీ డ్రెస్లో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. నిద్రమత్తులో అతన్ని పోలీస్ అనుకున్నాడు. క్షణంలో అర్థమైంది. పొడుగ్గా, సన్నగా మెరిసిన జుట్టుతో ఉన్న కాలనీ పోస్ట్ మేన్.
పోస్ట్ బాక్స్ ఉందిగా! అయినా ఉత్తరాలు అరుదుగా వస్తాయి. తనకొచ్చే సమాచారం సెల్ఫోన్ ద్వారా, మెయిల్ ద్వారా వస్తుంది. పోస్ట్మాన్ స్వయంగా ఉత్తరం తీసుకురావడమేమిటో?
అందరూ మోటర్ సైకిళ్ళమీద తిరుగుతున్నా, ఈ పోస్ట్మాన్ ఇంకా ఆ పాతకాలం సైకిల్ తొక్కలేక తొక్కుతూ, తనకు ఎదురుపడినప్పుడల్లా నమస్కారం పెడతాడు. అతడ్ని చూసినప్పుడల్లా 'తనకూ ఉత్తరం వస్తే బాగుండును, హాయిగా చదువుకోవచ్చు,' అనుకుంటూ ఉంటాడు. మొత్తానికి ఇన్నాళ్ళకు తన కల తీరింది.
'ఎక్కడినుంచో ఆఫీసు ఉత్తరమా! ఏ స్నేహితుడో వ్రాశాడా? అమెరికా నుండి.................