నా బాల్యం, మావాళ్లూ రెండు వందల ఏళ్ల వలస పాలనకు ముగింపు పలికి భారతదేశం 1947 ఆగస్టు 15న స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను పొందింది. ఆ తర్వాత రెండు నెలలకు అంటే 1947 అక్టోబర్ 21న పుట్టాను నేను. మా నాన్నగారి పేరు నోరి సత్యనారాయణ. మా అమ్మగారి పేరు కనకదుర్గాంబ. మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. సాధారణంగా రెండు మూడేళ్లకో మారు బదిలీలవుతూ ఉండేవి. ఆయన తాడంకి ఊళ్లో టీచరుగా పనిచెయ్యడం. నాకు లీలగా గుర్తుంది. నేను పుట్టినది కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని మంటాడ గ్రామంలో. ఇప్పుడు అది నూజివీడు రెవెన్యూ డివిజన్, పమిడిముక్కల మండలంలో ఉంది. గురజాడ, గరికపర్రు, కపిలేశ్వరపురం, యాకమూరు వంటివి మాకు సమీపంలో ఉండే చిన్న గ్రామాలు. ఉయ్యూరు, కలవపాముల, పామర్రు, పెదపారుపూడి, తోట్లవల్లూరు వంటివి కాస్త పెద్ద గ్రామాలు. మా సొంతిల్లు తోట్లవల్లూరు గ్రామంలో ఉండేది, మేం అక్కడే ఉండేవాళ్లం. నాకు గుర్తున్న బాల్యం అక్కడే గడిచింది మాకు దగ్గర్లోని పట్నం ఏదంటే విజయవాడే. అది సుమారు 35 కిలోమీటర్ల దూరం. మా నాన్నగారికి ఆధ్యాత్మిక భావనలు చాలా ఎక్కువ. ప్రతి ఆదివారం మౌనవ్రతం. చేసేవారు. సాధారణంగా పైన కాషాయవస్త్రం వేసుకునేవారన్నట్టు నాకు గుర్తుంది. సాయంత్రాలు, స్కూలు సెలవులప్పుడు దేవాలయాల్లో రామాయణం, భాగవతం, దేవీభాగవతం వంటివి ప్రవచనాలు చెప్పేవారు. మా అమ్మకు కూడా భక్తిప్రపత్తులు ఎక్కువే. నిత్యం లలితా సహస్రనామాలు చదువు కోవడం అమ్మకు అలవాటుగా ఉండేది. కురుమద్దాలి ఊళ్లో పిచ్చమ్మ అనే అవధూత ఒకామె ఉండేవారు. ఆమె ఉన్నంత కాలం మా అమ్మానాన్నలు తరచూ వెళ్లి ఆమెకు సేవ చేసేవారు, మరణించాక ఆమె సమాధి పట్ల అంతే భక్తిగా ఉండేవారు. మంటాడకు సమీపంలో కురుమద్దాలి గ్రామంలో...................... |