పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (18951971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్య శిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాల అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు.
గబ్బిలం (1941-43) జాషువా రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కావ్యం. వస్తువులోనూ, భావప్రకటనలోనూ, కవి హృదయ నివేదనలోనూ తెలుగు పద్య కవిత్వంలో ఇంత విప్లవాత్మక ప్రయోగం మరొకటి లేదు.
జనులం బీలిచి పిప్పిచేసెడి దురాచారంబులన్ గాలమ
ట్టని విద్యాబలమేల? విద్యయన మౌడ్య వ్యాఘికింపైన భో
జనమా? మోసపు వ్రాతకోతలకు రక్షాబంధమా? యెందుకీ
మనుజత్వంబు నొసంగలేని చదువుల్ మైరేయపుం మైకముల్
అన్నది జాషువా నిష్కర్ష.
అది ఆనాటికీ, ఈనాటికీ, ఏనాటికీ అయినా సత్యమే.