రంగారావు పేరు ఈ మధ్య తరచు విశేషంగా వార్తాపత్రికల్లో పడుతూ వుంది. దేశ ఆర్థిక, రాజకీయ విషయాల దగ్గర్నుండీ సాహిత్య, సాంస్కృతిక రంగాలదాకా అనర్గళంగా ఉపన్యాసాలిస్తున్నాడు. సభాధ్యక్షుడిగా, ముఖ్య అతిథిగా, వక్తగా రకరకాల పాత్రధారణతో ఉపన్యాసాలు దంచుతున్నట్టున్నాడు.
అతను పాల్గొనే సభలన్నింటి ఆహ్వానాలు నాకు తప్పకుండా అందుతూనే వున్నాయి.
రెండు మూడు సార్లు తనే స్వయంగా ఫోన్ల్చేసి ఆహ్వానించడం కూడా జరిగింది. నిజం చెప్పాలంటే వెళ్ళడం కుదరక కాదుగాని వెళ్ళాలన్న ఆసక్తే నాకు అంతగా లేకపోయింది. అనుకోకుండా బజార్లో తారసపడినప్పుడల్లా ఏ ఒక్క సభకూ రానందుకు రంగారావుతో నిష్ఠూరాలు తప్పడంలేదు.
ఉన్నట్టుండి ఇంత ప్రాధాన్యత రంగారావుకి ఎలా వచ్చిందన్నది నాకు ఒకపట్టాన అంతుబట్టలేదు. కొద్ది చదువు, చిన్నపాటి వ్యాపారంతో అతనింత పబ్లిక్ ఫిగర్ కావడం ఈ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు. నిలకడ మీద తేలిన నిజం ఏమిటంటే, అచ్చోసిన ఆబోతులా దేశం మీద పడి తిని తిరుగుతూ ఎందుకూ కొరగాకుండా పోయాడనుకున్న రంగారావు బావమరిదొకడు, రాజకీయాలకు పనికొచ్చి, కులం కలిసొచ్చి శాసనసభ్యుడయ్యాడు. కాకలు తీరిన రాజకీయ ప్రత్యర్థిని ఓడించాడన్న ముచ్చటకొద్దీ అధికార పార్టీ ఇతగాడికి ఒక మంత్రి పదవీ కట్టబెట్టింది. మంత్రిగారి జిల్లా పర్యటనలో భాగంగా రంగారావు ఇంట విందుభోజనాలారగింపుతో ఇద్దరి చుట్టరికం బహుళ ప్రచారం కావడంతో మావాడు రంగంలోకి వచ్చాడు. స్కూళ్ళు, కాలేజీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సాహిత్య సంస్థలు ఇలా ఒకళ్ళనేమిటి నానాజాతి సంఘాలవాళ్ళు రంగారావుని మంత్రిగారి ప్రతిరూపంగా భావిస్తూ ఉపన్యాసాలతో ప్రజల్ని తరింపజేయాలని పోటీలుపడుతున్నారు.
ఒకరోజు మ్యాట్నీ సినిమా చూసి, సరదాగా ఇంటిదాకా నడవడం ఆరోగ్యానికి మంచిదిలెమ్మని రెండు కాళ్ళకు పనిచెప్పాను.
హఠాత్తుగా నా పక్కన కీచుమంటూ అంబాసిడర్ కారొకటి సినిమా ఫక్కీలో ఆగింది. అందులోనుంచి రంగారావు హీరోలా దిగాడు.
"హలో చంద్రమౌళీ! ఎక్కడి దాకా” అంటూ కౌగలించుకున్నంత పనిచేశాడు. “ఇంకెక్కడికి, ఇంటికే!” అన్నాను తత్తరపడి.
"డ్రాప్డ్చేసి వెళ్తాన్లే, ఎక్కు" అన్నాడు అభిమానంగా.
"అబ్బే! నిమిషాల మీద ఇంటికెళ్ళాల్సిన అర్జంటు పనులంటూ ఏం లేవు. షికారుగా వచ్చానంతే" అన్నాను లిఫ్ట్ అవసరం నాకేమాత్రం లేనట్టు. "ఇంకేం! అర్జంటు పనులేం లేవంటున్నావుగా, నాతో రా! జస్ట్
ఒక గంటలో
వెళ్లొచ్చు" అంటూనే తను కారెక్కి ఆక్టోపస్ లా నన్ను లోనికి లాగడం డోర్ వేయడం |.............