గజదొంగ నికోలా
ఈ కథని వ్రాసే రచయిత యీ తిరుగులేని మనిషిని గురించీ, ఆ మనిషి జీవితాన్ని గురించీ వ్రాసేందు కవసరమైన సమాచారాన్ని సేకరిస్తూ 'నికొలాషూహై' దేశానికే వెళ్లాడు. నికొలా ధనవంతులు డబ్బుదోచాడు; బీదవాళ్ళకిచ్చాడు; ఎప్పుడైనా యెవరైనా చంపాడు అంటే తన ప్రాణాలు తాను రక్షించుకోవడానికీ, లేకపోతే పగతీర్చు కునేందుకూ - అంతే. విశ్వసనీయమైన అనేకమంది సాక్షుల్తోనూ, మంచి మనుషుల్తోనూ మాట్లాడాడీ రచయిత నికొలానిగురించి. నికొలా అంత యెదురులేని ఘటం కావడానిక్కారణం అతని చేతిలోని 'పచ్చమండ'యే కారణమనీ, ఆరెమ్మే ఆకొమ్మే, ఆమండే సిపాయీల తుపాకీ గుళ్ళనించి అతన్ని రక్షించిందనీ, అందులోనూ నడివేసవి జూలై నెలలో మిట్టమధ్యాహ్నం ముసురుకునే యీగల్ని విదలించుక్కొట్టే రైతులాగా, ఆ మండ నికొలా చేతిలో పని చేసిందనీ యీ రచయిత నమ్మకుండా వుండటం శక్యం గాకపోయింది, వాళ్ళందరూ చెప్పిన మాటలు విన్న తర్వాత.
ఎందుకనంటే- యీ దేశమే అలాంటిది. మంటలోకి విసిరేముందు మడచిన కాగితం మడతల్లాగా వుంటాయి- యీ దేశంలో పర్వతాలు వొత్తుత్తుగా, దగ్గర దగ్గరగా. కొన్ని శతాబ్దాల్నుంచీ మనం కనియెరుగం గాబట్టి అలాంటి విషయాలీదేశంలో జరుగుతాయంటే విని నవ్వేంతటి బుద్ధిమాంద్యం యింకావుంది మనకి. అబ్బ ! యెన్ని కొండ లెన్ని కొండలు యీ దేశంలో, కాకులు దూరని కారడవులు. చీమలు దూరని చిట్టడవులు. ఐనా అక్కడ వసంతశోభలో పువ్వులు పరిమళిస్తాయి; శిశిరంలో చెట్లు వెళ్ళాతాయి. వెలుగొస్తూ వొస్తూవుంటే చెట్ల నెత్తిమీది నుంచి బరువు బరువుగా కొండలమీదికి పాకిపొయ్యే మంచుతెర లేమిటనుకున్నారు? చనిపోయిన ఆత్మలు తీర్చిన బారులు! కొండలమీద తెరచాప లెత్తిపోయ్యే ఆ మేఘాలేమి టనుకున్నారు?.................