స్వాగతోపన్యాసం
డా. కె. శ్రీనివాసరావు
మహాత్మాగాంధీ వ్యక్తిత్వం, ఆయన ఆలోచనలు, ఆశయాలు, కార్యాచరణ, మార్గదర్శకత్వం మన దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టడమే కాకుండా దేశ నిర్మాణానికి ఎంతగానో దోహదం చేశాయి. సత్యం, అహింస, సత్యాగ్రహం, దీనజనసేవ మొదలైన విధానాల ద్వారా కొన్ని సంవత్సరాలపాటు ఆయన జరిపిన స్వాతంత్య్ర పోరాటం భారతీయుల్నే గాక, ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసింది.
జాతిపిత మహాత్మాగాంధీ ఆధునిక భారత నిర్మాతల్లో అగ్రస్థానంలో నిలిచారు. అంతేగాక ఆయన ఒక గొప్ప రాజనీతివేత్తగా, ఆదర్శ రాజకీయ నాయకునిగా, ప్రభావశాలి అయిన గొప్ప వక్తగా, అద్భుతమైన రచయితగా అన్నింటికీ మించి ఎంతో మంచి మనిషిగా అందరి మన్ననలూ పొందారు. వారి ఆశయాలు, ఆచరణ నుంచి ఎంతో కొంత నేర్చుకోగలిగితే అదే మనం ఆయనకు అర్పించగల గొప్ప నివాళి కాగలుతుంది.
"మహాత్మాగాంధీ వంటి ఒక మనిషి ఈ భూమ్మీద నడిచాడంటే భవిష్యత్ తరాలు ఎంతో ఆశ్చర్యపోతాయి” అని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఒకనాడు అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయన ప్రపంచంపై చూపించిన ప్రభావానికి గాంధీజీ ఆశయ ఆచరణ వారసత్వానికి గల గొప్పతనాన్ని ఆ మాటలు మనకు వివరిస్తాయి.
గాంధీ సిద్ధాంతాలు, రాజకీయ విధానం, ఆయన నమ్మిన విలువలు యథాతథంగా అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు. ఆయన జీవించిన కాలంలో కూడా కొంతమంది వ్యతిరేకించిన వారు ఉన్నారు. అయితే ఆయన అనుసరించిన మార్గం గతంలో కన్నా ఇప్పుడు ఎంతో ఆవశ్యకత సంతరించుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు...............