గండికోటకు సంబంధించిన చారిత్రిక వివరాలను 'తెలుగు సమాజం' సంస్థ ప్రచురించాలనుకోవడం చాలా సంతోషించదగిన విషయం. గండికోట వంటి అద్భుతమైన జల, గిరి దుర్గాన్ని రూపకల్పన చేసిన వాస్తు శిల్పులు ఎవరో, కట్టిన కూలీలెందరో, ఏఏ ప్రాంతాల వారో, వారు నిర్మాణంలో పడ్డ కష్ట నిష్ఠూరాలేమిటో - ఇలాంటివి మనకిప్పటికీ చరిత్ర గర్భంలో దాగిన అంశాలే. అట్లాగే గండికోట పాలన మొదలైనప్పటి నుంచి బ్రిటీషు పాలన దాకా సాగిన యుద్ధాలు జయాపజయాలూ స్థూలంగా మాత్రమే మనకు తెలిసినా ఆయా కాలాల సామాజిక చరిత్ర, ప్రజల జీవన విధానాలూ, ఆకాంక్షలూ, సుఖసంతోషాలూ మనకు తెలియవు.
ఈ మాటలు ప్రస్తావించడానికి కారణం సమగ్ర చరిత్రకు ఉపయోగించే స్థానీయ చరిత్ర ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడానికే! స్థానిక చరిత్రలో గ్రామాల చరిత్ర ఉంటుంది. గ్రామ సముదాయాల చరిత్రా ఉంటుంది. ఆ సముదాయాల భౌగోళిక, రాజకీయేతర అంశాల ప్రాధాన్యం ఉంటుంది. ఏమైనా ఈనాటి చరిత్ర అధ్యయనకారులు, రచయితలు స్థానిక చరిత్రను ఆవిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో వెలుగు చూస్తున్నదే ఈ 'గండికోట' పుస్తకం.