...మనసా స్మరామి
మనమహర్షులది జ్ఞానవృత్తి, అట్టి జ్ఞానవృత్తి చేతనే వారు, విశ్వసృష్టికంతటికీ మూలమైన
కాంతిని పోల్చుకోగలిగారు. ఆ కాంతి తరంగాలు శబ్దజనకాలై 'ఓం'కారనాదాన్ని
వినిపించాయి. అక్కడినుంచే వారి విద్యలన్నీ మొదలయ్యాయి. అలా మన మహర్షులు చూసిన తొలికాంతి, గణపతి రూపాన్ని ధరించి ఉంది. ఓంకార రూపి అయిన గణేశుని పేరును తొలి వేదఋషులు పైచిత్రంలోని విధంగా వ్రాసేవారని లిపిశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గణేశ లిపి దరిమిలా మాహేశీ, బ్రాహ్మీ లేదా సరస్వతీ, ఐంద్రీ, దేవనాగరి రూపాలలోకి మారింది. అయితే మన విద్యలన్నింటికీ మూలమైనది మాత్రం ఈ ఓంకారమే! ఈ వినాయకుడే!!
వినాయకుడంటే విఘ్ననివారకుడు. మంచిపనులకు, చెడ్డపనులకు కూడా ఏదోరూపంగా విఘ్నాలు తప్పవు. శ్రేయాంసి బహువిఘ్నాని... అన్నట్లు నిజానికి, మంచిపనులకే ఎక్కువ విఘ్నాలుంటాయి. వాటిని కలిగించేవాడు, తొలగించేవాడు కూడా ఆ వినాయకుడే. విఘ్నాలను ముందే తొలగించిన తరువాత, కార్యాన్ని ఆరంభించడం ఎవరికీ సాధ్యం కాదు. పోనీ అంటే మొదలుపెట్టాక వచ్చే విఘ్నాలకు జడిసిపోకుండా కార్యాన్ని కొనసాగించడం కూడా అందరి వల్లా కాదు. దేనికైనా సాధన అవసరం. విఘ్నాలతో అలిసిపోకూడదు. ప్రయత్నాన్ని విరమించకూడదు. దారి మళ్లిపోకూడదు. బాహ్యమైన అవరోధాలను, మనస్సంకల్పాలలో ఏర్పడేవాటిని కూడా గణేశ సాధనతో తొలగించుకోవాలి.
అందుకే మా శంకరభారతి ప్రచురణల నుంచి ఈ 'గణేశం భజే!'ని తొలి పుస్తకంగా తీసుకువచ్చాం. అనేక విఘ్నాలను అధిగమించి ఈ గ్రంథాన్ని మీకు అందించాం. దీనికోసం తెలుగునాట సుప్రసిద్ధులైన పండితులెందరో కలంపట్టి మమ్మల్ని ప్రోత్సహించారు. పుష్పగిరి పీఠాధిపతులు ఆశీఃపూర్వకంగా ముఖాముఖికి సహకరించారు. అజ్ఞాత శంకరభక్తులు ఆర్థికంగా ఆదుకున్నారు. ఈ ఉత్సాహంలో మరిన్ని మంచి గ్రంథాలను వెలువరించాలని ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఇటువంటి ప్రయత్నానికి శంకరభారతితో చేయి కలిపేందుకు అందరినీ స్వాగతిస్తున్నాం.
- నేతి సూర్యనారాయణశర్మ