గ్యాంగ్ వార్
రాత్రి పదిగంటల వేళ!
ఆకాశం, భూమి ఒకే రంగును పులుముకుని తాత్కాలికంగానైనా తామిద్దరూ ఒకటయ్యామని మురిసిపోతున్న క్షణం! భారతదేశంలోనే ప్రత్యేకత సంతరించుకున్న ఆంధ్రదేశపు రాజధాని భాగ్యనగరపు నడిబొడ్డులో వున్న ఆరంతస్థుల హెూటల్ దీపపు కాంతులతో ధగధగాద్దాయమానంగా మెరిసిపోతోంది.
ముఖ్యంగా... ఆ హెూటల్లో పెద్ద పెద్ద పార్టీలకి, రిసెప్షన్లకి నిర్మించిన ఆడిటోరియంలో కోలాహలంగా వుంది. అందుకు కారణం ఆ పట్టణపు పేరు మోసిన డిఫెన్స్ లాయర్ హరిహరరావు గారు!
ఆయన ఒక్కగానొక్క కుమార్తె వివాహం ఆ వుదయమే జరిగింది. తెలిసినవారికి, బంధుమిత్రులకి గ్రాండ్గా రిసెప్షన్ యిస్తున్నాడాయన! అదీ ఆ హడావుడికి కారణం.
హరిహరరావుకి పట్టణంలో ఒక గొప్ప లాయర్ పేరు ప్రఖ్యాతులు వున్నాయి. తనతోటి క్రిమినల్ లాయర్లతో పోల్చుకుంటే సంపాదన చాలా తక్కువ అయినా... ఇంకా నీతినిజాయితీ వదిలేయని మంచి లాయర్ ఎవరంటే చిన్నపిల్లాడు సయితం హరిహరరావు పేరు చెపుతాడు!
ఇరవై ఏళ్ళ ప్రాక్టీస్లో ఆయన సంపాదించినది పిల్లల చదువులకి, కుటుంబం గడవటానికి మాత్రమే సరిపోయింది తప్ప... స్థిరాస్థిగా ఆయనేమీ మిగుల్చుకోలేదు, నిర్దోషులను రక్షించే గొప్ప లాయర్ అన్న పేరు తప్ప!.............