యుగయుగాలుగా మనిషి అన్వేషిస్తూ వున్నాడు. తనకు అతీతంగా ఏదైనా వున్నదా, ఈ భౌతిక సంక్షేమానికి మించి ఇంకేదైనా వున్నదా - సత్యం అని, దైవం అని, యథార్థతత్వం అని, కాలంతో సంబంధం లేని ఒక స్థితి అని మనం అంటుండేది ఏదైనా వున్నదా - పరిస్థితుల చేత, ఆలోచనల చేత, మానవుడి చేత కలుషితం కానటువంటిది ఏదైనా వున్నదా.
మనిషిలో ఈ ప్రశ్న చిరకాలంగా రగులుతూనే వున్నది. ఇదంతా దేని గురించి? జీవితానికి అర్థం అంటూ ఏదైనా వున్నదా? జీవితంలో వున్న ఈ అంతులేని గందరగోళాన్ని చూస్తున్నాడు. క్రూరత్వం, దౌర్జన్యం, తిరుగుబాట్లు, యుద్ధాలు, అసంఖ్యాకమైన మతాలు, మత శాఖలు, సిద్ధాంత సూత్రాలు, జాతీయవాదాలు చూస్తున్నాడు. లోతుగా పాతుకొని పోయి నిలబడిపోయిన నైరాశ్య భావంతో ఇట్లా ప్రశ్నిస్తున్నాడు. నేను చేయవలసినది ఏమిటి? జీవనగతి అని మనం అంటున్న ఇది ఏమిటి? దీనికి ఆవలగా ఏమైనా వున్నదా? అనాదిగా తను వెతుకుతున్న ఆ సహస్ర నామాలు గల నామరహితత్వాన్ని కనిపెట్టలేక పోయాడు కాబట్టి మనిషి నమ్మకాన్ని పట్టుకున్నాడు. ఒక ఆపద్బాంధవునిలో నమ్మకం, ఒక ఆదర్శంలో విశ్వాసం - అలవరచుకున్నాడు. ఈ నమ్మకాలు, విశ్వాసాలు హింసను పెంచి పోషిస్తాయి. సందేహం లేదు.
జీవనం అని మనం అంటున్న ఈ నిరంతర సమరంలో మనిషి ప్రవర్తన ఇట్లా వుండాలి అని ఒక నియమ సూత్రావళిని పెట్టాలని ప్రయత్నించాం. ఈ నియమాలు మనం పెరిగిన సమాజానికి అనుగుణంగా వుంటాయి. అది కమ్యునిస్టు సమాజం అవచ్చు, ఏ నిర్బంధాలు లేని స్వేచ్ఛా సమాజం అవచ్చు. హిందువులు కాని, ముస్లిములు కాని, క్రైస్తవులు కాని ఎవరైనా సరే - వారి వారి సంప్రదాయాలను అనుసరించి ప్రవర్తనకు కొన్ని సూత్రాలను.............