గౌతమ బుద్ధ
అరుణోదయం
గడ గడ శబ్దం చేస్తూ రథం ముందుకు సాగుతున్నది. రథ చక్రాలు, పరుగిడుతున్న గుర్రాల కాళ్ళనుండి లేచిన దుమ్ము సాయంత్రపు అరుణ కిరణాల వెలుగులో బంగారు దుమ్ములా వుండినది. శుద్ధోదనుడు చాలా చింతా క్రాంతుడై రథంపై కూర్చొన్నాడు. అతడి మనసులోని వ్యగ్రత ముఖంలో స్పష్టంగా కనపడింది. మంత్రి సుగతుడు అతడి ముఖాన్నే చూడసాగాడు. కాని, అతనితో మాట్లాడడానికి ధైర్యముండలేదు. రథ సారథి చందక, తనపాటికి తాను రథం నడుపుతున్నాడు. శుక్లోదనుడు, శాక్యోదనుడు, ధోతోదనుడు, అలాగే అమితోదనుడు శుద్ధోదనుని ఈ నలుగురు సోదరులు, యితర ప్రముఖులు తమ తమ గుర్రాలపై అప్పటికే వీరి రథాన్ని దాటి ముందుకు సాగి పోయారు. కొంత దూరం అలా సాగినమీదట, శుద్ధోదనుడు, సారథితో, 'చందక, రథాన్ని లుంబిని గ్రామం వైపు నడిపించు,' అని ఆదేశించి మౌనం వహించాడు.
చందక, శుద్ధోదనుడి ఆదేశానికి సమ్మతి చూపి అటువైపు రథాన్ని పోనిచ్చాడు. దగ్గర దగ్గర ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళ వయసున్న చందక నాలుగైదు సంవత్సరాలనుండి సారథిగా పనిచేస్తున్నందున శుద్ధోదనుడి స్వభావాన్ని బాగా అర్థం చేసుకొని వున్నాడు. యజమాని ఇంతగా మానసిక ఒత్తిడికిలోనై గందరగోళం చెంది గంభీరంగా వుండినది అతడెపుడూ చూచివుండలేదు. వారు లుంబిని గ్రామం సమీపించినపుడు సూర్యాస్తమయమై కొంత సమయమైంది. రథశబ్ధం విన్న సేవకులు చకితులై రథంవద్దకు పారి వచ్చారు. ఎందుకంటే, ఈనాడు శుద్ధోదనుని ఆగమనం వారు నిరీక్షించ లేదు. ఇంతకు మునుపెపుడూ ముందుగా సూచన ఇవ్వకుండా అతడిలా ఎపుడూ రాలేదు. అలాంటి సూచన సామాన్యంగా ఒకరోజు ముందుగా లభించేది.
శుద్ధోదనుడు, సుగతుడు రథంనుండి దిగి ఆ ఉద్యానవనం మధ్యలో వున్న ఒక సామాన్య మైన విశ్రాంతి గృహాన్ని ప్రవేశించారు. శుద్ధోదనుడు అపుడపుడూ అక్కడికి వస్తున్నందున, అతడి విశ్రాంతికై నిర్మించబడిన ఈ గృహం అంతగా విశాలంగా లేకున్నా, అన్ని సదుపాయాలు వున్న ఒక సామాన్య గృహంలా వుండినది. అక్కడున్న కొందరు సేవకులు కొద్ది దూరంలో చేతులుకట్టి నిలబడ్డారు. సుగతుడు వారివద్దకు వెళ్ళి రాత్రి భోజనానికి కావాల్సిన ఏర్పాట్లు..............