శ్రీ ప్రచండ యాదవ నాటకము
అను
గయోపాఖ్యానము
ప్రథమాంకము
రంగము : యమునా తీరమందలి బృందావనము (సాత్యకి ప్రవేశించుచున్నాఁడు)
సాత్యకి- (తనలో) పూజ్యుఁడగు శ్రీకృష్ణుఁడు నిన్న సాయంకాలము నన్నుం జేరఁబిలిచి "వత్సాఁ సాత్యకీ! రేపు ఉదయమున మనము కాళిందీ జలంబున భగవానుండగు ప్రభాకరున కర్ష్య మొసంగి యనంతరము జలక్రీడామహోత్సవ మను భవింపవలయుఁ గావున నీవు నేఁటి రేయి నాల్గవజామున మేలుకాంచి, బలభద్రాదుల మేలుకొలిపి వలయు సన్నాహము చేయునది" యని సెలవిచ్చె. ఆ మహాత్ముని యాజ్ఞాబలమే నన్ను యథాకాల ప్రబోధితునిఁ జేసినది ఇఁక నాలుగు గడియలలోఁ దెల్లవాఱఁగలదు.
తే.గీ వసుమతీదేవి భర్తయౌ వాసుదేవు
దర్శనము చేయ లజ్జించి తాల్చినట్టి
తెల్లపట్టు మేల్ముసుఁగట్టు తేజరిల్లు
నీ యుషఃకాలచంద్రిక లింపు లలర
కువలయానంద సంధాయకుండును, మాకు వంశకర్తయు నగు నీ శీతమయూ ఖుండు మిమ్మందఱ విడిచి యస్తమించెఁగదా యని ఖిన్నుఁడైన వానివోలె మొగము - వెలవెలఁ బాఱ గ్రమంబున నప్తగిరిం ప్రవేశించుచున్నవాఁడు. అదిగో! త్రిలోకపూజ్యుఁ డగు దేవకీతనయుని మేల్కొల్పుటకై మంగళతూర్యారవము లిప్పుడే ప్రారంభమగు చున్నవి.
(తెరలో మంగళధ్వనులు మ్రోగిన పిదప వైతాళికుఁడు)
మ. నిను ధ్యానించి విముక్తులౌటకు మహానిష్టాగరిష్ఠాత్ములై
చనుచున్నారు మునీంద్రులీయమునలో స్నానంబుఁ గావింపఁగా
నిను సేవించి కృతార్థులౌటకును క్షోణీనాథు లిందందు! జే
రినవారీ వనమందు; మేలుకొనవే! కృష్ణా! జగన్నాయకా!
మ. గగనాంభోజ సువర్ణకర్ణిక మహత్కళ్యాణసంధాయకుం
డగు భామండుదయాద్రిందోఁచు నిఁకలెండంచున్ జనశ్రేణిఁబి
ల్చుగతిం గూసెను కుక్కుటంబులు కృపాళూ! సర్వలోకాశ్రయా!
జగదానంద విధాత! మేలుకొనవే! స్వామీ! జగన్నాయకా!..........