అలసిన ఊసులు
ఇవ్వాళ శుక్రవారమని నాకు తెలుసు. ఇవ్వాళటి నుండి కాలం ప్రతిక్షణం నన్ను ప్రశ్నిస్తూ నడిచిపోతుందని తెలుసు. గాలితోనో, శూన్యంతోనో, భూ ఉపరితలం తోనో మాటలాడుతూ పోతునే ఉండాలి. నేను ఆ అణువులో అణువుగా మారిపోవాలి. సోమవారపు దినపత్రికలను చూస్తానో లేదో! మనసు కొట్టే గంటలేమో గాని లెక్కలు గట్టే గంటలెక్కువయ్యాయి. ఈ లెక్కలు కట్టడాలు ఇవ్వాల్టివా నిన్నటివా ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి. ఇప్పుడూ... హూ... మనస్సును పది దిక్కులు పోనివ్వొద్దని, పరుగులు అలసటను తెస్తాయని... పదే పదే... ఇట్లా ఒంటరితనం జంట అయినప్పుడల్లా కలవర పెడ్తున్న లిప్తపాటు కాలం - నా హృదయ భావాల్ని అక్షరబద్ధం చేయగలిగే అద్భుతయంత్రాలుంటే.... హూ... ప్స్.... ఈ వైపా? ఆ వైపా....? ఎటు తిరగను? ఎటు తిరిగినా నిద్రరాదు.
నిద్ర నన్నెప్పుడు కరుణించాలి? ఎక్కిన మెట్లకంటే పడిన లోయలు ఎక్కువ కదా! అర్ధ ప్రారబ్దాల తీర్పేమో గాని ఆట మధ్యలో వెళ్ళిపోయే క్రీడాకారుణ్ణి. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం నేను చెదరని కలను.
"ఏయ్ మొద్దూ ఏడున్నవ్? ఏం జేస్తున్నవ్? ఇక్కడికి రా, ఎన్నిసార్లు పిలవాలి?" కర్కశంగా... కటువుగా, నిశిరాత్రి శునకపు అరుపులా, భయానకంగా ఉన్నది ఆ పిలుపు....................