ఘటికాపురి
నాంది
ఆంధ్రదేశమును శాతవాహనులు పరిపాలించిన తదనంతరం పాలించిన రాజవంశీయులలో విష్ణుకుండినులు ముఖ్యులు. వీరి పాలన మహోజ్జ్వల చరిత్ర. వీరి చరిత్ర వినయముతో, సమ్యక్ ప్రజాపాలనతో కూడి అనుపానమైనది. నేటి తెలంగాణా నుండి వీరి పాలన మొదలయ్యింది.
వీరు మునుపు చిన్న జమిందారులుగా ఉన్నా, తదనంతరం రాజ్యాలు జయించి, వీరి వంశ పరిపాలనను మొదలుపెట్టారు.
ఆనాటి బలమైన రాజ వంశీయులతో సంబంధబాంధవ్యాలు నెరపి, పూర్తి దక్షిణాపథాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. కొడిగట్టిన వైదికధర్మాన్ని పునరుద్ధరణ చేశారు. ఎన్నో దానధర్మాలు చేసి, వేదధర్మాన్ని పునః ప్రతిష్ఠించారు. అశ్వమేథ, వాజపేయ యాగాలు చేసి చరిత్రలో నిలిచిపోయారు.
11 తామ్ర, రెండు శిలా శాసనాలతో తమ జైత్రయాత్రను ప్రకటించారు. దాదాపు మూడు వందల సంవత్సరాలు (క్రీ.శ.358 నుండి 624) పరిపాలించి ధర్మం నిలిపారు. ప్రజారంజక పరిపాలకులుగా పేరు తెచ్చుకున్నారు. విద్యను వ్యాప్తి చేసారు. సంస్కృతం పోషించారు. విదేశీయులతో వర్తకము చేశారు. నాణాలు ముద్రించారు. శైవ దేవాలయాలను విరివిగా కట్టించారు. కళలను పోషించారు. ఆంధ్రదేశములోని గుహాలయాలు వీరు నిర్మించినవే.
బ్రాహ్మణ రాజ వంశీయులైన విష్ణుకుండినులలో రెండవ మాధవ వర్మ పాలన స్వర్ణయుగంగా పేరుపొందింది.
ఈయనకు ఇద్దరు భార్యలు. ఈయన చిన్నభార్య వాకాటక రాణి. విశాల వాకాటక సామ్రాజ్యము మాధవవర్మ ఏలుబడిలోకి రావటానికి కారణము ఈమెతో వివాహమే..............