నా మాట
నేను పుట్టింది ఇందుకేనా? అని నన్ను నేను ప్రశ్నించుకోగా, పుట్టింది ఇందుకే | అని ఒకేసారి అనిపించింది మా ఆవిడ్ని పెళ్ళి చేసుకున్నప్పుడు. సంసారం ఈదడం మధ్యతరగతి కుటుంబీకుడికి చాలా కష్టం. ఒక్కోసారి చిరాకు వేస్తుంటుంది. భార్య మీద విరుచుకుపడతాం. అది తప్పు.
మా ప్రొఫెసరు సంజీవరాజ్ గారు ఒక సలహా యిచ్చారు. భార్య నిద్రపోతున్నప్పుడు ఆమె ముఖం ఒకసారి చూడు. ఎంత నిర్మలంగా వుందో గ్రహిస్తావు. నిన్ను నమ్మి, పుట్టింటిని వదిలిపెట్టి, తల్లిదండ్రుల్ని, అక్కాచెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని వదిలి పెట్టి నీ జీవిత భాగస్వామిగా, నువ్వు కట్టిన తాళిని ఆసరాగా పెట్టుకుని, నీ ఇంటి గడప తొక్కింది. నువ్వు ఆమెను పోషిస్తావని, గౌరవిస్తావని, ప్రగాఢ విశ్వాసంతో, నువ్వు ఆమెకు ఎల్లవేళలా రక్షగా వుంటావన్న ధైర్యంతో, ప్రశాంతంగా నిద్రపోతున్నది. ఆమెను ప్రేమించు. ఆమె మీద కోప్పడకు. ఆమె కంట తడిపెట్టకుండా ఆమెను కాపాడు. నీ కాపురం ఆనందమయం ఔతుంది. ఇది అక్షరసత్యం. మనం పుట్టింది ఇందుకే అని తప్పకుండా అనిపిస్తుంది.
మా రామ్ బాబాయి సంజీవరాయన్పేటలో, మా కామాక్ష్మమ్మవ్వ ఇంటి ఎదురుగా వుంటారు. మంచి ఆస్తిపరుడు. పచ్చయప్పాస్ కాలేజీలో యం.ఏ చదివారు. మా యింటికి ఆదివారాల్లో వచ్చి మా కుప్పుస్వామి బాబాయిని కలుస్తుంటారు. బాగా ట్రిమ్ డ్రెస్ ఔతారు. చొక్కా టక్ చేయరు. క్రాపు బాగా నూనె పెట్టి అదిమి వెనక్కి దువ్వుకుంటారు......................