చిన్ననాటి రోజులు
చర్మకారుల్లో ఒక ఉపకులం ధుసియాలు. బీహారు పశ్చిమజిల్లాలు, ఉత్తర ప్రదేశ్ తూర్పు జిల్లాల్లో ధుసియాలు ఎక్కువగా ఉంటారు. జీవనోపాధి నన్వేషిస్తూ వాళ్లు దేశమంతా వ్యాపించారు. పశ్చిమాన పెషావరు నుండి తూర్పున థాయ్లాండ్ దాకా విదేశాల్లో కూడా వ్యాపించారు. బ్రిటిషు వాళ్లకు కాంట్రాక్టు కూలీలుగా ఆఫ్రికాకు కూడా వలస వెళ్లారు. వాళ్లు ఎక్కడికి వెళ్లినా ఆహారం, భాష, ఆచారాల విషయంలో తమ ప్రత్యేకతను కాపాడుకున్నారు. తోలు పరిశ్రమలోనే కాక వాళ్లు వ్యవసాయంలో కూడా పనిచేశారు. కుల వివక్షాపూరితమైన హిందూ సమాజం కష్టపడి పనిచేసే ఈ జనాన్ని అస్పృశ్యులని పేరుపెట్టి దూరంగా ఉంచింది. అణచివేతకు, నిర్లక్ష్యానికి, దౌర్జన్యానికి గురైన ఈ కులానికి అభివృద్ధి ద్వారాలన్నీ మూసుకుపోయాయి. మా పూర్వికులు ఈ ధుసియా అనే ఉపకులానికి చెందినవాళ్లు.
మా తాత అలహాబాదులోని ముల్టీగంజ్ ప్రాంతంలో నివసించేవాడు. ఆయన చాలా పేదవాడు. మానాన్న బీర్బల్ దాస్ 1852 లో జన్మించాడు. పిల్లలమంతా ఆయన్ని బాబా అని పిలిచేవాళ్లం. తనకు చదువుకోవాలన్న అభిలాష ఉండేదనీ కాని కుటుంబ పరిస్థితులు అనుకూలించలేదనీ బాబా చెప్పేవాడు. దగ్గరిలోని పాఠశాల వెలుపల నిలబడి బడికి వెళుతున్న పిల్లలవైపు ఆశగా చూస్తున్న ఆయన్ని ఉపాధ్యాయుడు చూశాడట. ఆయన బాబాను పిలిచి బడి ఫీజుకట్టి పుస్తకాలు కొనుక్కుంటే చాలుననీ తక్కిన సహాయమంతా చేస్తాననీ చెప్పాడు. నాన్న ఒక దర్జీ వద్ద సహాయకుడిగా చేరి చేత్తో టోపీలు కుట్టడం నేర్చుకున్నాడు. అప్పటికి కుట్టుమిషన్లు వాడడం లేదు. బడి ఫీజుకు, పుస్తకాలకు అవసరమైన డబ్బు నాన్న ఆదాచేశాడు. ఉపాధ్యాయుడు చాలా తోడ్పడ్డాడు.
ఆ రోజుల్లో బ్రిటిషుసైన్యం స్థానిక వైద్యుల్ని నియమించుకునేది. తెలివైన భారతీయ విద్యార్థులు ఎనిమిదో తరగతి పాసయిన తర్వాత వైద్య విద్య నభ్యసించవచ్చు.................