విజయక్క పతాకకు జై!
ఇది ఒక వ్యక్తి జీవితంలో అనుభవించిన జ్ఞాపకాల గుచ్ఛంలా కనిపిస్తుంది గాని వాస్తవానికి అపురూపమైన సామాజిక చరిత్ర శకలాల గుచ్ఛం. ఆ సామాజిక చరిత్ర కూడ సాధారణమైనది కాదు, తెలుగునాట ప్రభావశీలమైన ప్రజా ఉద్యమాల, సాహిత్య ఉద్యమాల మూలాలకు సంబంధించిన అసాధారణమైనది. వేలాది, లక్షలాది మందిని కదిలించిన, ఉత్తేజపరిచిన వ్యక్తుల, పత్రికల, పరిణామాలు జీవధాతువులేమిటో ఈ జ్ఞాపకాలు చూపుతాయి. అది ఇరవయో శతాబ్ది చివరి నాలుగు దశాబ్దాలకూ, ఇరవయ్యొకటో శతాబ్ది తొలి రెండు దశాబ్దాలకూ సంబంధించిన చరిత్ర. ఒకానొక వ్యక్తి లేదా, ఆ వ్యక్తి కుటుంబంలో, స్నేహ బృందంలో కొందరు వ్యక్తుల దృక్కోణాల లోంచి ఈ ఆరు దశాబ్దాల హైదరాబాద్ జీవితం, తెలుగు జీవితం వ్యక్తమవుతున్న చరిత్ర ఇది.
ఒకదాని నుంచి ఒకటి ప్రవహించే ముప్పై ఆరు అధ్యాయాలలో సాగిన ఈ కథనానికి సహజంగానే అనేకానేక పార్శ్వాలూ కోణాలూ ఉన్నాయి గాని మూడు మౌలికమైన ఉజ్వల స్రవంతుల వికాసం గురించి మాత్రం చెప్పాలి.
అవి మొదటిది జ్వాలాముఖి అనే ఒక అద్భుత వ్యక్తిత్వ ప్రవాహం. రెండోది రంగనాథం, పిలుపు అనే మరొక మహోజ్వల చరిత్ర ప్రవాహం. మూడోది, అతి సాధారణంగా కనిపించే మనుషులు అసాధారణ వ్యక్తిత్వాలుగా మారిన అద్భుత స్థల కాలాల గురించిన కథన ప్రవాహం.
ఇప్పటికి జ్వాల జీవితచరిత్ర ఎవరో కొందరి జ్ఞాపకాల రూపంలో మాత్రమే వెలువడినట్టుంది గాని ఆ విస్తార మూర్తిమత్వాన్ని దర్శింపజేసే సమగ్ర జీవితచరిత్ర రాలేదు. ఇక్కడ విజయక్క కూడ ఆ సమగ్ర జీవితచరిత్ర రాసిందనలేను గాని, అందుకు అవసరమైన ఎన్నో ముడిసరుకులను, సూచికలను, కొలమానాలను ఇస్తున్నది. జ్వాల...............