వారణం ఆయిరం
'తిరుమొళి' అంటే తమిళ కవితా శైలిలో 'పవిత్ర పద్యాల'ని అర్ధం. నాచ్చియార్ అంటే 'స్త్రీ'. 'దేవత' అని కూడా అర్ధం. అందుచేత ఇవి సాక్షాత్తు దేవత అనుగ్రహించిన పవిత్ర శ్లోకాలు'. ఈ పద్యాలు తన ప్రియుడైన కృష్ణుని పట్ల అండాళ్ అనుభవించే తీవ్రమైన వాంఛను వ్యక్తం చేస్తాయి. తమిళ కవిత్వ సంప్రదాయాలు, వేదాలు, పురాణాల ప్రసక్తులతో ఆండాళ్ నాచ్చియార్ తిరుమొళిలో విస్తారమైన భారతీయ మతసాహిత్య పరిధిని యావత్తు అనుపమానమైన దృశ్యాలలో సృష్టిస్తుంది. ఈ 143 శ్లోకాలు నాలాయిర దివ్య ప్రబంధంలోని 4000 దివ్య స్తోత్రాలలో ఒక భాగం. ఆండాళ్ ఈ శ్లోకాలను పద్నాలుగు దశకాలుగా వర్గీకరించింది. అందులో ప్రముఖమైనది 'వారణం అయిరం'.
ఋగ్వేద విధానంలో జరిగే వైవాహిక క్రతువులోని ఐదు భాగాలను మన పూర్వీకులు ఇలా క్లుప్తంగా వివరించారు:
వాగ్దానం చ ప్రధానం చ వరణం ప్రాణి పీడనం సప్తపదితి పంచాంగా వివాహః పరికీర్తితః
పై శ్లోకం ప్రకారం హిందూ సంప్రదాయ వివాహానికి ఈ క్రింది ఐదు అంగాలు (భాగాలు) ఉన్నాయి: వాగ్దానం, కన్యాదానం, వర ప్రేక్షణం, పాణిగ్రహణం, సప్తపది, భారతదేశంలో జరిగే సంప్రదాయ వివాహాలన్నింటిలోనూ ఇవి తప్పక జరుగుతాయి. మిగిలిన తంతులన్నీ తరువాత వేడుకగా వచ్చి చేరినవి.
143 పాశురాలలో ఆండాళ్ రచించిన నాచ్చియార్ తిరుమొళిలో ఆరవదైన వారణ మాయిరం అనే మకుటంతో ప్రసిద్ధిపొందిన పది పద్యాలలో గోదాదేవి తన స్వప్నవృత్తాంతంలో శ్రీమన్నారాయణుడితో జరిగిన తన వేదోక్త వివాహాన్ని వివరిస్తుంది...
జీవాత్మ పరమాత్మను కాంక్షించి, పొందటమనే విషయానికి ప్రతీక ఐన గోదా చరితం శ్రీవైష్ణవ భక్తి ఉద్యమానికి ఒక కొత్తకోణాన్ని ఆవిష్కరించింది. ఆమె తండ్రితో సహా పలువురు మహాభక్తులైన ఆళ్వారులు గోదా చూపిన పథాన్ని అనుసరించి తరించారు..............