తారాస్ బుల్బా
"ఊఁ.. ఇలా వెనక్కి తిరగండి. చూద్దాం. దిష్టి బొమ్మల్లా తయారయారేం ? ఫాదరీల్లాగా ఆ అంగీలేవిఁటి? మీ కాలేజీ కుర్రాళ్ళంతా యిలాంటి వుడుపులే ధరిస్తారాయేం?"
విద్యాలయంలో చదువు ముగించుకుని ఇలా అంటూ ముసలి బుల్బా, ఇంటికి తిరిగివచ్చిన కొడుకు లిద్దరికీ స్వాగత వచనాలు పలికాడు.
అతని కొడుకులు అపుడే గుర్రాలు దిగారు. ఇద్దరూ బొద్దు మనుషులు. యువజన విద్యార్థులందరిలాగానే బిడియస్తులు. వారి మొహాలలో ధైర్యస్థయిర్యాలు, ఆరోగ్యం, నూనూగు మీసాల నూత్న యవ్వనం తొణికిసలాడుతున్నాయి. తండ్రి ఇలా స్వాగతమిచ్చే సరికి కంగారుపడి, నేలకేసి నిలకడగా చూస్తూ స్థబ్దుగా నిల్చుండిపోయారు.
"కాస్త వుండండి. మిమ్మల్ని కళ్ళారాచూస్తాను" అంటూ బుల్బా వారిని తనవైపుకు తిప్పుకున్నాడు. "యేవిఁటంత పొడుగాటి కోట్లుమీరూ ? బలే- బలేకోట్లూ ! యింతవరకు ప్రపంచంలో యిలాంటి కోట్లుకున్నామా, విన్నామా ? మీలో వకరు కాస్త అలా పరిగెత్తండి. కాళ్ళకి కోట్లు అడ్డుపడి కిందపడతారో లేదో చూద్దాం.”
"మమ్మల్ని చూసి నవ్వబోకు నాన్నా! నవ్వబోకు.” అన్నాడు పెద్దకొడుకు. "ఊఁ- అబ్బ ! యెంతగర్వమో ! యెందుకు నవ్వగూడదేం ?"
"యెందుకా ? నువు నా కన్నతండ్రి వయినప్పటికీ నను చూసి నవ్వితేమాత్రం..................