పిల్లల కోసం బొమ్మల పూజ
నేనొక కొయ్యబొమ్మల కళాకారుడిని. వయసు అరవైయారు. పదమూడేళ్ళ వయసు నుంచి ఈ బొమ్మల ఆటలో నిమగ్నమయ్యాను. మా ఊరు అంతరవళ్ళి. ఇది హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకాలో ఉంది. మా నాన్న హనుమనగౌడ. అమ్మ కమలమ్మ. 1947 మార్చి 1న నేను పుట్టిన రోజు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరంలోనే నేను పుట్టాను. ఇది నా అదృష్టం కాదా? మా కులం రెడ్డి లింగాయత. ఇంటి పేరు జీవనగౌడ అని. జీవన గౌడ అన్నది మా వంశంలోని ఒక పెద్దాయన పేరు.
చుట్టుప్కలున్న పల్లెల జనం మమ్మల్ని 'గొంబె గౌడరు' (బొమ్మలను ఆడించే గౌడగారు అని అర్థం) అని పిలుస్తారు. ఈ పేరు మా వంశానికి సుమారు నాలుగు వందల సంవత్సరాల నుంచీ వాడుకలో ఉందని మా నాన్న చెప్పేవారు. మా వంశంలోని ఒక పూర్వీకుడు ప్రదర్శించిన బొమ్మల ఆటను చూసి మెచ్చుకున్న విజయనగరం రాజులు తామ్ర శాసనం ఇచ్చారంట. ఆ తామ్ర శాసనాన్ని పూనా విశ్వవిద్యాలయం పరిశోధకులొకరు వచ్చి తీసుకునిపోయాడు. తిరిగి తెచ్చి ఇవ్వనే లేదు. మా వంశంలో పారంపర్యంగా వస్తున్న కొయ్యబొమ్మల ఆట గురించి ఉన్న ముఖ్యమైన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాం. ఇలాంటివి చేయకూడదన్న అవగాహన విద్వాంసుల్లో ఉండాలి. సరే, మా వంశానికి విజయనగరం కాలం................