గౌతమలహరి - కావ్య విమర్శా ఝరి
కళారత్న కాశీ కవి;
అసమాన అవధాన సార్వభౌమ
డా॥ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
ఆర్షేయంబును పౌరుషేయముగ కావ్యానంద విశ్లేషణల్
హర్షవిత గౌతమర్షి ఘన గోత్రాంశల్ శతానందముల్
వర్షించెం గద వ్యాసరూపమగు సేవన్ పింగళీడ్యాన్వయో
త్కర్షన్ వేంకట కృష్ణరాయకవి తత్తాత్పర్య మూహించెదన్.
మధురకవి బిరుదాంచితులు పద్య, గద్య, గేయ, నాటక, యక్ష గానాది బహు ప్రక్రియా రచనలతో, పింగళి, కాటూరి వంటి మహాకవుల సారస్వత పరిశోధనలతో, సాహితీ రూపక ప్రదర్శనలతో ప్రసిద్ధులు, ప్రపితామహాదిగా అనుష్ఠానపరులు, ప్రాజ్ఞులు దైవజ్ఞులు అయిన కవితాకృష్ణ పింగళి వెంకట కృష్ణారావు గారు తమ సాహితీషష్టిపూర్తి శుభవేళ కడచిన అరవై ఏళ్లుగా వివిధ పత్రికలలో, సదస్సులలో తాము రచించిన సాహితీ వ్యాసావళిని సంపుటీకరించిన అద్భుతమైన 'గౌతమలహరి' వ్యాస సంకలనంలోని అనేక విశేషాలకు స్థాలీపులాకప్రాయం ఈ అభిప్రాయం.
తమ గోత్రఋషి ఋణం తీరేటట్టు 'గౌతమలహరి' నామకరణం, పితృఋణం తీరేటట్టు ప్రపితామహులకు అంకితం, దేవఋణం తీరేటట్టు శివతత్త్వం, శ్రీవిద్యా ప్రతిపాదనలతో పింగళి వారు ఋణత్రయ విముక్తులు అవుతున్నారు. సాహితీ షష్టిపూర్తికి ఇదే ఉగ్రరథ శాంతి. ఇదే మృత్యుంజయ హోమం. సహస్ర చంద్ర దర్శనోత్సవానికి సమగ్ర సాహితీ సంపుటిని అందుకుందాం.
గౌతమలహరిలోని పదమూడు వ్యాసాలలో శ్రీనాథుని నుండి శ్రీశ్రీ వరకు వారి పద్యగద్యరచనా విశ్లేషణ విశిష్టం. కొసమెరుపు ఆచార్య లక్ష్మీకాంతం గారి ఆంగ్లానువాద శైలి పరామర్శ. వైవిధ్య భరితంగా ఆత్మదర్శన స్థాయిలో ఉన్న ఈ వ్యాసాలు సాహిత్య విద్యార్థులకు పరిశీలనాపాధేయాలు. సాహితీ ప్రియులకు ఉపాధేయాలు.
'శ్రీనాథుని చాటువులు' : నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను ఆచార సంప్రదాయాలు, స్త్రీల కట్టుబొట్లు మొదలైన అంశాలను, ఆనాటి జీవన...........