పుస్తక పరిచయం
గ్రామ దేవతలు: మన సంస్కృతికి మూలాలు
బొల్లోజు బాబా
భక్తుడెవరో నీకు రక్తమోడే ఖండిత శిరస్సును
గుప్పెడు బియ్యం గింజలను సమర్పించినట్లుగా
రాత్రిదేవత నీకు అస్తమించే సూర్యబింబాన్ని
మిణుకుమనే నక్షత్రాలను సమర్పించుకొంటుంది -
వాక్పతిరాజు, ప్రాకృత కవి యశోవర్మ అనే రాజు వింధ్యవాసినిని పూజించేటపుడు వాక్పతిరాజు చెప్పిన పద్యం ఇది. ఆ తరువాత పద్యంలో మహాపశుబలిని చూడటానికి యువతులు ఒకరిభుజాలపై ఒకరు ఎక్కి ఉత్సాహపడుతున్నారు అనే వర్ణన ఉంటుంది. ప్రాచీనభారతదేశంలో వైదిక ఆరాధనకు సమాంతరంగా కొన్నిసార్లు ఒకదానినొకటి ప్రభావితం చేసుకొంటూ సాగిన అమ్మదేవతల ఆరాధనను ప్రతిబింబించే ఘట్టమది.
పైన చెప్పిన వాక్పతిరాజు ఎనిమిదో శతాబ్దానికి చెందిన ప్రాకృతకవి. ప్రాకృతభాష జనసామాన్యుల భాష. కాకతీయుల, విజయనగర శాసనాలలో మధ్యయుగపు తెలుగు కావ్యాలలో గ్రామ దేవతల ప్రస్తావనలు ఈ సంస్కృతి యొక్క ప్రాచీనతను ఋజువు చేస్తాయి.
**
మానవ జీవితంలో ఆకలి, భయం ప్రధాన పాత్ర వహిస్తాయి. వీటినుంచి విముక్తి ఆధ్యాత్మికతలో లభిస్తుంది. బహుళదేవతారాధన హిందూమతం ప్రత్యేకత. దేవతలలో పురాణ/శిష్టదేవతలు, గ్రామ దేవతలు అని రెండు రూపాలుగా అభివర్ణించారు.
బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, గణేశుడు మొదలైన దేవతలు శిష్ట దేవతలు. అని పిలవబడ్డారు. ఈ విశ్వం యొక్క సృష్టి, స్థితిలయ వంటి సార్వజనీన అంశాలను శిష్టదేవతలు నియంత్రిస్తారనే విషయం ఎన్నో పురాణాలు చెప్తాయి. వీరికి బ్రాహ్మణులు పూజారులుగా ఉండి షోడశోపచారాలతో సేవలు జరిపిస్తారు.........................