క్లుప్తంగా...
అనుకున్నది ఒకటి.. అయినదొకటి.. అనే పాట నాకు బాగా గుర్తుకొస్తోంది. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత గ్రామాల పరిస్థితి ఇదేనా అనిపిస్తుంది. ప్రజా ప్రతినిధుల (రిపబ్లిక్) రాజ్యం పోయి నాయకుల రాజ్యం అయిందా అనిపిస్తోంది. వాళ్ల ప్రభంజనం వల్లే పరిస్థితులు దిగజారాయని ఉద్దేశ్యం కాదు. గ్రామాల తీరుతెన్నుల గురించి దూరదృష్టితో ఊహించటం లేదేమో అనిపిస్తుంది. గ్రామాల్లో జరుగుతున్న తీరు మాయాబజార్ను గుర్తు చేసేలాగా వుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే. ఏ ఎన్నిక ఆ ఎన్నిక వరకే ఆలోచన. ప్రజలందరి మీదా కాదు దృష్టి. అదే నా నిరాశ, ఆందోళన. ఇదే మా ఊరి పరిస్థితి, క్లుప్తంగా. అందుకే ఈ పుస్తకం.
75 సంవత్సరాల స్వాతంత్ర్యం సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఇవే పరిస్థితులు. మరింత ప్రాముఖ్యత, గర్వించదగిన చరిత్ర ఉన్న మా ఊరిలో కూడా అదే పరిస్థితి. ఈ విషయాలు వార్తాపత్రికల వాళ్లు రాయరు. రాజకీయ నాయకులు మాట్లాడరు, విద్యాలయాలు తెలుసుకోరు, వ్యాపారస్థులు, కాంట్రాక్టర్లు అసలే మాట్లాడరు.
గాంధీగారి గ్రామ స్వరాజ్యం ఎప్పుడో మర్చిపోయామా అనే రీతిలో. గ్రామాలు కబ్జాలోకి వెళ్లిపోయాయా?
ప్రజలు "బాధితులుగా” ఆధార పడ్డ వాళ్లుగా లో చేయబడ్డారా అనిపిస్తుంది.
గ్రామాల జనాభా లెక్కలు ఇప్పుడు ఓటర్లు ఎంత మందనే దానిని బట్టే? అంటే..?
గ్రామాలు గర్వించేలా వుండాలిగా!