కవికోకిల
జడజగత్తును రసమయం చేసి చైతన్యభిక్ష పెట్టేది కవిత్వం. ఆధునికాంధ్ర సాహిత్య జగత్తులో సంప్రదాయచ్ఛందాన్ని స్వీకరించి సామాజికాభ్యుదయం కోసమే సాహితీవ్రతాన్ని సాగించిన ప్రజాకవి గుర్రం జాషువా.
శారద వరించిన కవిగా జాషువా ప్రసిద్ధుడు. జాషువా రచించిన ప్రతికావ్యం వెనుక ఏదో ఒక ప్రేరణ, ఒక దృఢమైన కారణం లేదా సంస్కరణ భావం, ప్రబోధదీప్తి ఉన్నాయనటం సముచితం. పద్యం ద్వారా అభ్యుదయాన్ని ఆశించిన కవిగా జాషువా ప్రసిద్ధుడు. విశ్వనరునిగా తనను తాను ప్రకటించుకొన్న విలక్షణ కవిచక్రవర్తి గుర్రం జాషువా. ఖండకావ్యరచనలో, లఘుకావ్య నిర్మాణంలో తనకు తానే సాటి అని నిరూపించుకొన్న విశిష్ట ప్రతిభా సముద్రుడు.