(నాందేడ్)
కళ్యాణ్ జగిత్యాలలోని "శ్రీ సరస్వతీ శిశుమందిర్" పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నప్పుడు, Excursion (విహారయాత్రకు) వెళ్ళాడు. కళ్యాణ్ అప్పటి వరకూ వాళ్ళ అమ్మని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. అయితే తనతో బాగా స్నేహంగా ఉండే దక్క Excursion కి వెళ్తుండడంతో, తను కూడా వెళ్ళాలని అనుకున్నాడు. ఈ విహారయాత్ర దసరా సెలవుల్లో ఉంటుందని ఉపాధ్యాయులు తెలియజేసారు. ఈ _యాత్ర చదువుల తల్లి క్షేత్రమయిన “బాసర జ్ఞానసరస్వతీ" దేవి సన్నిధి నుండి మొదలయి, మహారాష్ట్రలో నాందేడ్, ఔరంగాబాద్, నాసిక్, షిర్డీ, అజంతా, ఎల్లోరా మొదలయిన ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. ఇందులో బొంబాయి మహానగరం కూడా ఉంది. కళ్యాణ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. 5 సెప్టెంబర్ 1991 విహారయాత్రకి బయలుదేరబోతుంది. కళ్యాణ్ లోలోపల అమ్మని వదిలిపెట్టి వెళ్తున్నా అని భయం భయంగా ఉన్నా, విద్యక్క కూడా వస్తుందని ధైర్యంగా అనిపించిదతనికి.
ఉదయం 7: 00- 7:30 వరకే విహారయాత్రకు బయలుదేరే విద్యార్థులంతా తమ తమ బ్యాగులతో బస్సు వద్దకు చేరుకుంటున్నారు. కళ్యాణ్ని బస్సు వద్ద దిగబెట్టడానికి వాళ్ళ అన్నయ్యలిద్దరు వచ్చారు. బస్సు వద్ద పిల్లలు, వారిని దిగబెట్టడానికి వచ్చిన వారితో చాలా కోలాహలంగా ఉంది. కళ్యాణ్కి మాత్రం లోపల భయం అలాగే కొనసాగుతోంది. "అమ్మని వదిలి 10 రోజులపాటు ఎలా ఉండాలి ?” అన్న భయమది. అప్పుడే విద్యక్క బస్సు వద్దకు వచ్చింది. ఆమెను చూడగానే మళ్ళీ విద్యక్క ఉంది, అని ధైర్యం వచ్చేసిందతనికి. కళ్యాణ్కి విద్యక్కకి వయస్సులో రెండు సంవత్సరాలు తేడా. అయినా ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారు. స్కూల్ నుండి రాగానే, విద్యక్క, కళ్యాణ్ లు వాళ్ళింట్లో కూర్చుండి కబుర్లు చెప్పుకోవడం, ఇంకా రకరకాలయిన ఆటలు ఆడుకునేవారు. కళ్యాణ్ వాళ్ళు ఉండే కాంపౌండులోనే విద్యక్క వాళ్ళు, మిగతా పిల్లలు అందరూ ఉండేవారు. సెలవుల్లో అయితే సందడే సందడి..........