ఒక సిగరెట్కోసం
- వార్లాం షాలమోవ్
ఆకలి తీరలేదు గాని వాళ్ళు పెట్టిందేదో మాట్లాడకుండా తినేశారు. ప్లేట్ను శుభ్రంగా నాకేశాడు గ్లెబోవ్. ఆ తర్వాత, టేబుల్ మీద పడిన బ్రెడ్డు ముక్కల్ని, పిసరు కూడా వదలకుండా కుడిచేత్తో పోగుచేసి ఎడమ చేతిలో వేసుకుని, తరువాత తినొచ్చుని జేబులో దాచుకున్నాడు. పళ్ళ మధ్యన కూడా కొద్దిగా ఆహారం తట్టుకుంది. నాలికతో ఒకసారి తడిమి చూసుకున్నాడు. దాన్ని వెంటనే మింగెయ్యకూడదు. 'రుచి ఎలా వుంది?' అని అడగడం అనవసరం. అక్కడ అలాంటి విషయాల గురించి ఆలోచించేదెవరూ... లాలాజలం ఊరి, నోటిలోని ఆహారం నెమ్మదిగా కరిగింది.
గ్లెబోవ్ నోటి మీదే దృష్టి కేంద్రీకరించాడు బాగ్రెట్సోవ్. వాడింకా ఏదో నముల్తున్నాడన్న మాట! ఎంత అదృష్టవంతుడు!
గ్లెబోవ్ గుటకేశాడు. ఆకాశంలో చంద్రుడు నారింజపండులా కనిపించాడు. ఇక పని ప్రారంభించాలి.
"పద" అంటూ లేచి నిల్చున్నాడు బాగ్రెట్సోవ్. ఎవరికీ అనుమానం రాకుండా, పిల్లులలాగా నడిచి ఓ రాళ్ళగుట్టను చేరుకున్నారిద్దరూ. చీకటిగా వుంది. మధ్యాహ్నమంతా నిప్పుకణికల్లా మండిన రాళ్ళు ఇప్పుడు మంచు ముద్దల్లా వున్నాయి. చొక్కా గుండీలన్నీ పెట్టుకుని చలినుండి రక్షించుకునే చివరి ప్రయత్నం చేశాడు గ్లెబోవ్. నడిస్తే ఒంట్లో వేడి పుడుతుందంటారు గాని, ఆ రోజు ఏమీ ఫలితం కనిపించలేదు.....................