"నేల విడిచి సాము" చేయలేము. అదే విధంగా ఎటువంటి ప్రక్రియ చేయాలన్నా ఆధారం అవసరమే. ముద్రల విషయంలో మినహాయింపు ఏమీ లేదు.
సాధకులకు ... మంచి స్థలం... మంచి వాతావరణం... మంచి ఆలోచనలు దృఢసంకల్పము అవసరము.
"స్థైర్యంచ అంగలాఘవమ్" అనే వాటికి మూలం ఆసనమే కదా! ఎక్కువ సమయం స్థిరంగా ఉండగలిగే ఆసనమును ఎన్నుకోవాలి. ఆ ఆసనంలో నిల్చొని, కూర్చొని లేక పడుకొని ముద్రాసాధన చేయాలి.
84 లక్షల ఆసనాలు వేసేద్దామా ? అక్కర్లేదు. "స్థిరసుఖమాసనమ్" అనేదానిని అనుసరించి సౌకర్యంగా ఉండే ఆసనాల్ని ఎంపిక చేసుకుందాం. యోగసాధకులకైనా సులువైన ఆసనాలే కావాలి. అదే విధంగా 'ఆరోగ్య' సాధకులకైనా సులువైన ఆసనాలే కావాలి. కొన్ని ఆసనాలను మీకు అందిస్తాను. వానిలో మీ తత్త్వానికి అనువైన వాటినే ఎంపిక చేసుకొని, స్థితిలోనే ముద్రలు వేయటం ప్రయోజనకరంగా ఉంటుంది.
ముద్రలు-ఆసనాలు : ఆసనాలు కండరాలను బిగించేవిగా కష్టంగా ఉండకూడదు. కండరాలు, నాడుల్లోని బిగువు వేళ్ళ మీద ప్రభావం చూపుతుంది.
వేళ్ళు. శరీరంలోని వివిధ భాగాలకూ తత్త్వాలకు ప్రాతినిథ్యం వహిస్తాయి. అట్లాంటప్పుడు ముద్రలు వేయటం రాదు. వేళ్ళ కండరాల్లో బిగువు ఉంటే రుద్రముద్ర, హృదయ ముద్ర, యోనిముద్ర వంటి వానిని వేయలేము. మరొకచేతి సహాయంతో వేళ్ళను ముద్రవలె అమర్చుకోవలసి వస్తుంది. కళ్ళుమూసుకొని ప్రశాంతంగా ఉండి శరీరంలోని పత్రి చిన్న కండరాలనూ సడలించాలి. వేళ్ళను మడవటం, చక్కగా చేయటం సాధనచేయాలి.
ఒకచేతి వేళ్ళను వేర్వేరు దిశల్లో కదిలించటం, విభిన్న అమరికలో ఉండటం సాధన చేస్తుండాలి. ఉదా : మహాశీర్ష ముద్రలో ... బొటనవేలి చివరను చూపుడు మధ్యవేలి చివరలకు తాకించాలి. ఉంగరపు వేలిని అరచేతిలోనికి మడవాలి. చిటికెనవేలిని స్వేచ్ఛగా వదలివేయాలి.
ఇది వాస్తవంగా క్లిష్టమేగానీ "న్యూరో- మస్కులర్ కో ఆర్డినేషన్" తో చేస్తే సులువే. అంతేగాక వయస్సు ముదురుతున్న కొద్దీ నాడీ మండలముపైన పట్టుకోల్పోతారు. కండరాలు చెప్పితే వినని పరిస్థితి ఏర్పడవచ్చు. "యథోస్థితిః తథోమనః" అనేదాన్ని ప్రాతిపదికగా స్థిరంగా ఉండగల్గితే చిత్తం కూడా స్థిరమవుతుంది. ఒక సమన్వయం ఏర్పరచుకోవాలి.
మళ్ళీ ముద్రవేసిన కొద్దిసేపటిలోనే వేళ్ళు అనాలోచితంగానే విడిపోతాయి. వాటిని కలిపి ఉంచటానికి కూడా శిక్షణ అవసరమే.................