నిన్ను నీవు తెలుసుకో, నీలాగే నడుచుకో, గుర్తుంచుకో, ఈ భూమి మీద నీవు తప్ప మరెవ్వరూ నీలా వుండరు
నార్త్ కరొలినా మౌంట్ ఏరిలోని మిసెస్. ఎడిత్ ఆల్ రెడ్ నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది. "నా చిన్నవయసులో నాకు విపరీతమైన సిగ్గు వుండేది. నా మనసు చాలా సున్నితంగా వుండేది," అని ఆమె ఉత్తరంలో చెప్పింది. నేను అధిక బరువుతో వుండేదాన్ని. దానికి తోడు నా బుగ్గలు నన్ను ఇంకా లావుగా కనిపించేలా చేసేవి. నాకో పాతకాలపు ధోరణిగల తల్లి వుండేది. ఆమె దృష్టిలో అందంగా కనిపించేలా దుస్తులు వేసుకోవడం ఒక మూర్ఖత్వం. ఆమె ఎప్పుడూ. ఇలా చెప్పేది. “బొద్దుగా వున్నవారు ఒంటిని బట్టలతో నింపుకుంటారు, సన్నగా వున్నవారు చింపుకుంటారు" అని. ఆమె నాకు అలాంటి దుస్తులే వేసేది. నేను ఎప్పుడూ పార్టీలకు వెళ్ళలేదు, ఎప్పుడు ఏ సరదాలకు నోచుకోలేదు. మరి నేను స్కూల్లో చేరినప్పుడు, స్కూల్ బయట జరిగే ఏ కార్యక్రమంలోనూ కనీసం అథ్లెటిక్స్ లో కూడా ఇతర పిల్లలతో ఎప్పుడూ కలవలేదు. నాకు భరించలేనంత సిగ్గు. నేను అందరికన్నా "ప్రత్యేకమైనదానిననీ” అందుకే ఎవరికీ నేను నచ్చననీ, భావించేదాన్ని."
"నేను పెరిగి పెద్దయ్యాక, నాకన్నా చాలా ఏళ్ళ పెద్దవయసున్న వ్యక్తితో వివాహమైంది. కానీ నేను ఏ మాత్రం మారలేదు. మా అత్తవారింటి వారు చాలా మర్యాదస్తులు, ఆత్మవిశ్వాసం కలవారు. నేను పూర్తిగా వారి లాగా వుండివుండవచ్చు. కానీ అలా లేను. వారిలా వుండటానికి నా శాయశక్తులా ప్రయత్నించాను కానీ వుండలేకపోయాను. నా నుండి నన్ను బయటికి లాగడానికి వారు చేసిన ప్రతి ప్రయత్నము, నన్ను మరింత దూరంగా నా ముసుగులోకి లాక్కుని వెళ్ళింది. నేను చాలా ఒత్తిడితో, చిరాకుగా వుండేదాన్ని. మా స్నేహితులందరినీ దూరం చేసుకున్నాను. నా పరిస్థితి చాలా దారుణంగా తయారై, డోర్ బెల్ మ్రోగితే కూడా భయపడే స్థితికి వచ్చాను. నాది విఫల జీవితం. ఆ విషయం నాకు తెలుసు: నా....................