మొదటి భాగం
మధ్యాహ్నం మూడు దాటాక ఇంక శేషు ఆకలి తట్టుకోలేకపోయాడు. అప్పటికే గంట నుంచీ నిద్ర పోదామని, నిద్రలో ఆకలి మర్చిపోదామని ట్రై చేశాడు. కడుపులో ఖాళీ బ్లాక్హోల్ లాగ పెరుగుతున్నట్టే ఉంది గానీ నిద్రయితే పట్టలేదు. కాసేపటికి తల తిరగటం కూడా మొదలై ఇంక శోష వస్తుందని భయమేసింది.
లేచి గదిలో కప్ బోర్డులు వెతకటం మొదలుపెట్టాడు. మాసిన ఫేంట్ల జేబుల్లో చేతులు దూర్చి తడిమాడు. గూట్లో పుస్తకాల కింద వేసిన న్యూస్ పేపరు ఎత్తి చూశాడు. కనీసం ఒక పది రూపాయిలు దొరికినా సమోసాతో కానిచ్చేయచ్చు. ఉద్యోగం ఉన్న రోజుల్లో ఎక్కడైనా డబ్బులు పెట్టి మర్చిపోయే ఉంటాడు. అలా అనుకోగానే... ఏదో గుర్తొచ్చీ రానట్టు! దాస్తోయెవ్స్కి 'వైట్ నైట్స్' పుస్తకాన్ని అల్మరాలోంచి లాగాడు. (దరిద్రం, దాస్తోయెవ్స్కి సినానిమ్స్). ప్రయాణాల్లో పుస్తకాలు చదవటం శేషుకి అలవాటు. కానీ చదువుతున్న పుస్తకం ఏమిటాని ఎవరైనా ఓర చూపులు చూట్టం ఇష్టం ఉండదు. అందుకే పుస్తకాలకి అట్టలు తొడుగుతాడు. ఇప్పుడు ఆ పుస్తకం అట్టలోంచి పచ్చగా, స్నేహంగా తొంగి చూస్తుందొక ఐదొందల నోటు. ఎప్పుడో జేబు బలిసిన రోజుల్లో పెట్టి మర్చిపోయింది ఇప్పుడు కాపాడుతుంది.... బుజ్జిముండ.
కాసేపటికి గ్రీన్ బావర్చీలో వేడి సువాసనల మధ్య చికెన్ బిర్యానీ తిన్నాడు. ఆకలి కడుపు మీద తిన్న బిర్యానీ చాలా బావుంది. పది రూపాయిలు టిప్ ఇచ్చి, వెయిటర్ పెట్టిన పళ్ళెం లోంచి కాసిని సోంపు గింజలు, టూత్ పిక్కూ చేతిలోకి తీసుకుని రోడ్ మీదకి వచ్చాడు. ఇప్పుడిప్పుడే వేడెక్కుతున్న ఫిబ్రవరి నెలాఖరు ఎండ, పళ్ళు కుట్టుకుంటూ నడుస్తుంటే మత్తుగా ఉంది. అడుగులు వాటంతటవే పడుతున్నాయి. జేబులో మిగిలిన మూడొందలతో ధీమాగా కూడా ఉంది. సినిమాకి వెళ్ళాలనిపించింది. రేపెలాగూ డబ్బులు వచ్చేదుంది. ఈ మూడు వందలూ ఇప్పుడు అనవసరమైన బరువు. పంజాగుట్ట పివిఆర్ సినిమాస్ వైపు నడిచాడు........