ఇంద్రధనుస్సు
శనివారం పొద్దున పదకొండుగంటలు అయింది. గర్ల్స్ స్కూల్ గంట గణగణ మోగింది. పిల్లలు అందరూ గుంపుగా బిలబిలమంటూ బయటికి వచ్చేశారు. మరో అయిదు నిముషాలు అయ్యాక టీచర్లు కబుర్లు చెప్పుకుంటూ బయటకు వచ్చారు.
అందరికన్నా ఆఖరుగా బయటకు వచ్చిది శాంతి. పూతీవలాటి శాంతి నడుస్తూ వుంటే అందమే కదలివచ్చినట్లుంది. చకచకా నడుస్తున్నదల్లా వెనకనుంచి ఎవరో పిలిచినట్లయి అగి చూసింది.
"మేడమ్! మేడమ్!" అని అరుస్తూ రొప్పుతూ వచ్చింది ఆ చిన్నపిల్ల. "ఏమిటమ్మా? ఏంకావాలి?" అడిగింది శాంతి.
"మేడమ్! ఈ రోజు పాటలపోటీలో నేను బాగా పాడానా?" అడిగింది ఆ పిల్ల. "బాగానే పాడావు" అంది శాంతి నవ్వుతూ.
"మరి! మరి నాకు ప్రైజ్ వస్తుందా?" ఆశగా అడిగిందా పిల్ల.
చిన్నగా నవ్వింది శాంతి. "కొంటెపిల్లా! అలా అడగకూడదు. రేపు లేదు ఎల్లుండి ఎలాగూ తెలుస్తుందిగా!" సరదాగా ఆ అమ్మాయి నెత్తిన మొట్టికాయ వేసింది. బోలెడంత సరదాపడిపోయి రొప్పుకొంటూ పరిగెట్టింది ఆ పిల్ల.
వెనక్కి తిరిగి మళ్ళీ నడక మొదలుపెట్టింది శాంతి. అలాగే ఓ ఫర్లాంగు నడుచుకుంటూ వెళ్లి చిన్న పెంకుటింటి లోపలికి దారితీసింది.
చిన్న ఇల్లు. ఇంటిముందు బోలెడు ఆవరణ. బంతి, బంగళాబంతి, మెట్టతామర మొక్కలు క్రమబద్ధంగా పెరుగుతూ పూలతో నిండి, వింత అందాన్నిస్తున్నాయి. గేటు మూసేసి లోపలికి వెళ్ళింది శాంతి. వాకిలి తలుపుకి తాళం లేదు. చిన్నగా నవ్వుకుని తలుపు తట్టింది...............