అందాల్సిన రైలు అందుతుందో లేదో గానీ బాగా హడావిడిగా పరుగులు. మాత్రం తప్పలేదు. మెట్రో రైలు గేట్లు మూసేలోపు సర్ ర్..ర్.. ర్... మని జారుతూ లోనికి దూరాను. ఇరుక్కున్న జనాలు నా జారుడుకు తిట్టుకున్నారో, జడుసుకున్నారో కానీ నేనైతే పోకిరి మహేష్ బాబు లాగా ఫీలయ్యా. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే తక్కువబ్బా... ఇప్పుడు మా సుధీర్ గాడు ఉండి ఉంటే ఫోన్లో బంధించేవాడు, దెబ్బకు వైరలయ్యేది. ఏదో పీకినట్టు చుట్టూ స్లో మోషన్ లో చూశాను. అందరూ వాళ్ళ వాళ్ళ ఫోన్లలో తలలు దూర్చి తిప్పలేక తిప్పలు పడుతున్నారు. ఉవ్వెత్తున ఎగిసిన ఊపు కాస్తా చతికిలబడింది.
మా తమ్ముడు ముందే స్టేషనుకెళ్ళి టికెట్ తీస్తానన్నాడు. వీడు వచ్చాడో రాలేదో, వచ్చినా ఏఫోనో మాట్లాడుకుంటూ చెప్పిన పని మర్చిపోతాడేమోనని అనుకుంటూ వాట్సాప్ లో ఓ మెసేజ్ పెట్టాను. 'ఆన్దవే అన్నయ్యా..' రెండు పళ్ళు బయట పెట్టిన ఎమోజీతో రిప్లై. హమ్మయ్య వచ్చేస్తాడులే అనుకుని ఫోన్ పై జేబులో వేస్తుంటే ఎవడో హిందీలో ఏదో అడుగుతున్నాడు. స్టేడియం అనేది ఒకటి పట్టుకుని మెట్రో నాలుగు దిక్కుల నాలుగు పేర్లు చెప్పాడు. ఫైనల్ గా ఉప్పల్ అని అర్థమయ్యి, ఇక్కడ నాకే కొత్త అలాంటప్పుడు మనల్ని ఒకడు తోపని ఫీలైతే వచ్చే కిక్కే వేరనుకుని "యే ట్రైన్ సీదా ఉప్పల్ జాతా" అంటూ తెగ కష్టపడి నాకు వచ్చిన హిందీ మొత్తం వాడాను. పానీ పూరి బండోడి దగ్గర 'కోడా ప్యాస్ లో' అనే గొప్ప హిందీ తప్ప మన హిందీ జ్ఞానం షూన్యం.. కావాలంటే వీరేహం పైకాహం పంతులుని అడగొచ్చు.
ఈలోపు దిగాల్సిన సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసింది. ఇంక ఐదు నిమిషాలే అనుకుని గబగబా మెట్లు దూకుతూ ఉరుకుతూ వస్తూ మా తమ్ముడుకి కాల్ చేశాను. "ఇంకో ఐదు నిమిషాలు నువ్వెళ్ళి ట్రైన్ చూసి టికెట్ తీసుకో అన్నయ్యా" అన్నాడు. చచ్చాం. పో.. అంత టైం సెట్టవుద్దా.? సర్లే చూద్దామనుకుని పరిగెత్తి ఆయాసపడితే పదకొండు గంటల ట్రైన్ ఒంటిగంటకని డిస్ప్లే బోర్డ్ చూపిస్తుంది. మిగతా రైళ్ళు ఒక్కసారిగా నన్ను తికమక పెట్టి అదేదో హారర్ సినిమాలో చుట్టూ చేతులు వచ్చినట్టు అనిపించింది. మా వాడు రాకుండా టికెట్లు దేనికని వెయిట్ చేస్తున్నాను...................