Description |
---|
అంకెలు, అక్షరాలూ ఒకదానికొకటి నేపథ్యం! క్యాలండర్ లెక్కలమేరకి 1901 మొదలుకుని 2000 సంవత్సరం వరకూ ఇరవయ్యో శతాబ్ది అనిపించుకుంటుంది. పైపైన చూస్తే, ఇది ఓ లెక్క మాత్రమే! లోతుల్లోకి వెళ్తే తప్ప ఈ లెక్కల సారం మన దృష్టికి రాదు. అందుకోసం అంకెల్ని, అక్షరాల నేపథ్యంలో పరిశీలించే ప్రయత్నం చెయ్యాలి! లేదా, అక్షరాల్ని అంకెల నేపథ్యంలో చూడాలనుకున్నా తప్పేం లేదు! విషయమేమిటంటే, ప్రధాన స్రవంతి చరిత్రకూ, సాహిత్య చరిత్రకూ ముడిపెట్టాలి. అదే నా ప్రయత్నం. ఈ నేపథ్యంలోనే ఇరవయ్యో శతకం, ఇరవయ్యో దశకం నాటి తెలుగు సాహిత్యాన్నీ, తెలుగు రచయితలనూ పరామర్శించేందుకు ఇక్కడ ప్రయత్నిస్తాను. ఆ పరంపరలో ఇది తొలి ప్రయత్నం. ముందు, ఇరవయ్యో శతకం స్వరూప స్వభావాలను పరిశీలిద్దాం. సాహిత్య చరిత్రలో ఇరవయ్యో శతాబ్దిది నిజంగానే ఓ విశిష్ట స్థానం. ఈ శతాబ్దిలోనే మానవ నాగరికత - అనేక రంగాల్లో - మూలమలుపు తిరిగిందని చరిత్ర గ్రంథాలు చెప్తాయి. అంతవరకూ సాగిన అభివృద్ధి అంత ముఖ్యం కాదనీ, ఆ తర్వాత జరిగిందే అసలయిన అభివృద్ధనీ చరిత్ర బుకాయించదు. ప్రతి యుగంలోనూ చరిత్ర గమనానికి సాపేక్షిక వేగం అనేది ఒకటుంది. అది ఏ యుగంలో ఎక్కువగా వుంటే, దానికి విశిష్టత ఆపాదించడం చరిత్ర విద్యార్థుల సామాన్యగుణం. ఆ గుణంలోంచే ఇలాంటి సామాన్యసూత్రాలు పుట్టు కొస్తుంటాయి - అంతే!! ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాలకూ, సంస్కృతికీ ఈ సూత్రీకరణ మరింతగా అనువర్తిస్తుంది. ఇది, ఒక్క తెలుగు సాహిత్యానికో, తెలుగునేలకో, దక్షిణాదికో లేక భారత దేశానికో పరిమితమయింది కాదు. ప్రపంచమంతటా, ఇరవయ్యో శతాబ్దికి యిలాంటి శి వుంది. ఉదాహరణకి, ఫ్రెంచ్ సాంస్కృతిక చరిత్రలో ఇరవయ్యో శతాబ్దంలోకి కాలం మళ్ళుతూ ఉండిన తొలినాళ్ళను 'లా బెల్ ఇపాక్' (సౌందర్య యుగం) అనడం కద్దు........... |