జీవితాలు అల్లిన జమిలి పోగు
రుబీనా పర్వీన్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మా ఊరి వైపు సంక్రాంతికి బంతిపూల తోటలేస్తారు. ఆ కాలమంతా మా చుట్టుపక్కలున్న లోగిళ్లన్నీ ఆ పూలతోరణాలతో కళకళాడతాయి. నాకు అలా బంతిపూల తోటలేయడం ఇష్టం. తోటి మనుషుల బతుకు గడపలు సమృద్ధిగా ఉండటం ఇష్టం. ఆంత్రప్రెన్యూర్గా మారాక ఒక ప్రాజెక్టు తర్వాత ఇంకో ప్రాజెక్టు చేస్తూ ఏదో ఒక మేరకు కొందరి జీవితాల్లో ఆలంబనగా నిలిచాను. మార్పుకు కేటలిస్ట్గా పని చేశాను. అయితే ఈ ప్రయాణంలో ఒక మత్తుకు గురై చాలాకాలం దాటేశానని ఇప్పుడు అనిపిస్తోంది. నేను రాయగలను. రాయవలసిన జీవితాలను చూశాను. కాని రాయాలన్న ధ్యాస లేకుండా పోయింది. లేకుంటే ఈ పుస్తకం ఒక పదేళ్ల ముందే వచ్చి ఉండేది.
నేను పుట్టిన చిన్నఊరు, నాకు ఊపిరి ఇచ్చిన సమూహము నాకు చాలా పరిమితులు విధించగలదు. నా మాటను, భాషను, చదువును, పెళ్లిని, నేను చేయాల్సిన పనిని అన్నీ అది అదుపు చేయగలదు. లేదా కండీషన్ చేయగలదు. అయితే అదృష్టవశాత్తు మా అమ్మా, నాన్నలు నన్ను ఆ మూసలో పడనివ్వలేదు. మా అమ్మ బాగా చదువుకుంది. పెళ్లయ్యాక కూడా చదివి డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పని చేసేది. మా నాన్న గవర్నమెంట్ టీచర్. ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి... అందరూ తమ జీవితాల్లో ప్రయోగాలు చేయడానికి వాళ్లు అనుమతించారు. నేను, నా ఇద్దరు చెల్లెళ్లు భిన్నమైన పెద్ద చదువులు చదవగలిగాం. మా తమ్ముడు.............