కమ్యూనిష్టులం
----సుబ్బారావు పాణిగ్రాహి
కమ్యూనిస్టులం మేము కష్టజీవులం
అవునన్నా కాదన్నా అదే యిస్టులం
అన్యాయాన్నెదిరిస్తాం న్యాయాన్నె పాటిస్తాం
అడ్డంకులు దాటేస్తాం మా కార్యం సాధిస్తాం
శ్రమజీవుల రక్తంతో జెండా నెగురేశాము
మృతవీరుల ఆశలతో మున్ముందుకే పోతాము.....
మాకున్నది సిద్ధాంతం - నమ్మం ఏ వేదాంతం
లంచాలకు తలవంచం - మా ఆత్మను వంచించం........
అరెస్టులను సాగించి - ప్రజాశక్తి నడ్డలేరు
అరచేతిని అడ్డుపెట్టి -సూర్యకాంతి నాపలేరు.
డబ్బులకై ఆశయాల - నంగడిలో అమ్మబోము
నిర్బంధాలకు భయపడి - - రివిజనిస్టులం కానేకాము........
దేశాలకు రాష్ట్రాలకు - పరిమితమై ఉండబోము
సకలదేశ శ్రామికులం - ఏకమై తీరుతాం......
మా ప్రజలను నడిపిస్తాం - మా గమ్యం చేరుస్తాం.
మా లక్ష్యం సాధిస్తాం - సమాజాన్ని మారుస్తాం.......
ఓ అరుణపతాకమా!
- సుబ్బారావు పాణిగ్రాహి
ఓ అరుణపతాకమా - చేకొనుమా రెడ్ శాల్యూట్
శ్రమజీవుల కేతనమా - నీకిదిగో రెడ్ శాల్యూట్
మృతవీరుల త్యాగఫలితమే - నీ వర్ణం ఎరుపయ్యింది.
నీ రెపరెపలను వీక్షిస్తుంటే - మా రక్తం ఉప్పొంగింది..... ॥ ఓ అరుణ ॥
ఏనాడో మాననీయులు నిను చేతను బట్టారు.
సర్వస్వం త్యాగంచేస్తూ - మాకై నిలబెట్టారు........
నీలో వున్నది సుత్తి - ఆది కార్మిక నవీన శక్తి
కలిసున్నది నీలో కొడవలి - సంఘటితం రైతు జనావళి ॥ ఓ అరుణ ॥