చెరువుకింద పైర్లు తలలు వంచి గుసగుసగా 'శుభోదయం' చెప్పుకుంటున్నాయి.
ఈదురుగాలి కొమ్మరెమ్మలను, గువ్వలు పువ్వులనూ పలకరించిపోతున్నది.
మాలగువ్వలు రెక్కలు టపటపలాడిస్తూ పైర్లపై గింగిరాలు కొడుతున్నాయి.
రేయిమేత గువ్వలు పైర్లను ఒరుసుకుంటూ నెలవులకు పోతున్నాయి.
బావిగట్టుపై చెట్టుకున్న గూళ్ళలో జీనిబాయిలు కువకువలు మొదలెట్టాయి.
కీచురాళ్ళు బావిదరువు నెర్రెలనుంచి మౌనంగా బయటకు పాకుతున్నాయి.
చుక్కలు ఒక్కొక్కటిగా ఎక్కడివక్కడ మాయమవుతున్నాయి.
ఎర్రటి పటాన్ని బయటికి నెట్టడానికి తూర్పుదిక్కు పురిటినొప్పులు పడుతూ ఉంది.
చాలదన్నట్లు ఆ పూట మంచూ, మబ్బులు కలిపి పటానికి అడ్డుపడుతున్నాయి.
"ఈ దిక్కులు, భూమి, వెలుతురు, చీకటి, గాలి, నీరు, మబ్బులు, జీవులు... ఇన్నింటి మధ్య కొన్నాళ్ళు గడిపి పకృతిలో కలిసిపోయే మనిషి. ఇంతేనా జీవితం.” ఒక్కసారిగా చుట్టూ ఉన్న పంటభూములనుంచి వినవస్తున్న ఉదయ రాగాలను ఆస్వాదిస్తూ, కళ్ళముందు ప్రకృతి పరచిన జీవన వేదాన్ని ఆకళింపు చేసుకుంటూ, ఎదురుగా కనబడుతున్న జీవులు తమ ఉదయపు అడుగులెలా వేస్తున్నాయో గమనిస్తూ, జీవితం గురించి ఆలోచిస్తూ వేదాంత కవిలె తోలుతున్నాడు.
ఆ చెరువుకింద బావులనుంచి రైతులు వంతులవారీగా కవిలె తోలుకోవడం ఆనవాయితీ, ఆ రోజు ఉదయం వేదాంత వంతు.
తాళ్ళతో ఎద్దులను బారివెంబడి వెనక్కిలాగుతూ, ముక్కునొప్పి తెలియకుండా 'దాదా' అంటూ, నీటిలో బాన మునకేసి జాటీతో సైగచేస్తూ, మోకుపై కూర్చుని ఎద్దుల వీపులపై చేతులారా తడుముతూ, 'చో చో' శబ్ధంతో అనునయిస్తూ, లల్లాయి పదాలు గొణుక్కుంటూ, కవిలె తోలుతున్నాడు... కవిలె తోలడాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రకృతిలో తనూ ఒకడయ్యాడు..........