కలకానిది
అది ఒక చిన్న పల్లెటూరు అందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనంసాగిస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్యపంటలైన పొగాకు బాగా పండిస్తారు. పొగాకు బ్యార్నీలు కూడా ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఆ ఊరికి పట్నం పోకడలు వస్తున్నాయి పొగాకు కొనుగోలు అమ్మకాలు బాగా జరుగుతుంటాయి. ఇదివరకు కూలీ కొరకు వలస వెళ్ళే ఊరిజనం అక్కడే ఉండి కడుపు నిండా అన్నంతిని దర్జాగా బ్రతుకుతున్నారు. పూరి ఇళ్ళు డాబాలుగా మారుతున్నాయి. ఆడవారు, మగవారు రకరకాల రంగులబట్టలు వేసుకొని తిరుగుతున్నారు.
ఆ ఊరిలో వెంకటేశ్వర రావు అనే రైతు ఉన్నాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి పెద్ద అమ్మాయి పేరు శ్రీవిద్య, రెండవ అమ్మాయి నికిత, కొడుకు పేరు శ్రీను. భార్య జబ్బుమనిషి నాలుగు రోజులు తిరిగితే నెలరోజులు మంచం మీద ఉంటుంది. వెంకటేశ్వరరావు తన పొగాకు వ్యాపారంలో సంపాదించిన సొమ్ము ఆమె మందులకే సరిపోతున్నాయి.
శ్రీవిద్య ఏడవ తరగతి ఆఊరి ప్రభుత్వ స్కూలులో చదువుతున్నది. చెల్లెలు 5వ తరగతి, తమ్ముడు 2వ తరగతిలో ఉన్నారు. ప్రతి రోజు ఇద్దరిని స్కూలుకు ముస్తాబు చేసి తను కూడా తయారై స్కూలుకు వెళ్తూ తన ఇద్దరి తోబుట్టువులను జాగ్రత్తగా చూస్తున్నది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు ఇంట్లో పనులు అన్నీ చేసి అన్నం వండి తండ్రికి పెట్టి తనుకు తన తమ్ముడు చెల్లెలకు టిఫీన్ బాక్స్లు సర్దుకొని జాగ్రత్తగా స్కూల్కు తీసుకొనిపోయి సాయంత్రం వారికి తెలియని పాఠాలు చెబుతూ వయసుకు మించిన బాధ్యతలు నిర్వర్తిస్తూన్నది శ్రీవిద్య...........................