ఏది రాస్తే నవ్వొస్తుందో గోపిరెడ్డికి ఎలా తెలుసు?
తాడి ప్రకాష్
జోకు పేల్చడం, సెటైర్ వేయడం, హాస్యాన్ని పండించడం అందరివల్లా అయ్యేపని కాదు. కథలు చాలామంది రాస్తారు. హ్యూమరే ఆక్సిజన్గా కథలు రాయడం అంత వీజీ కాదు. దానికో ప్రత్యేకమైన చూపు కావాలి. యాంత్రికమైన నిత్య జీవన రొటీన్ నుంచి హాస్యాన్ని పిండాలంటే అతను ఏదుల గోపిరెడ్డి లాగా వంకర దృక్పథ ధారియై ఉండాలి. ఎంత చక్కని, తిన్నని, స్పష్టమైన విషయాన్ని అయినా ఒంకర టింకరగా చూడగలిగే కొంటెతనం ఏదో నరాల్లో ప్రవహిస్తూ ఉండాలి. కొండొకచో ఇన్నోసెంట్ పీపుల్ మీద కూడా క్రూయల్ జోక్స్ కట్ చేసే దుస్సాహసానికి పాల్పడే మొండి ధైర్యమేదో ఉండి తీరాలి. ఒకింత ఆశ్చర్యమూ, మరింత విభ్రమమూ కలిగించే విషయం ఏమిటంటే, నిరాశనిండిన నిస్సారమైన బతుకులోని హాస్యాన్నీ, అల్లరినీ డిస్కవరీ చేయగలగడం! అదేమంత చిన్నా చితకా పనికాదు. బతుకులోని కాఠిన్యమూ, కన్నీళ్లూ... రెండింటినీ నిర్మమకారంగా చూడగలిగే గోపిరెడ్డి లాంటి పోలీసులు కథా రచయితలు కాగలుగుతారు.
గోపిరెడ్డి చాలా కాన్షస్ రైటర్. ఏం రాస్తున్నాడో, ఎందుకు రాస్తున్నాడో, ఈజీగా, హేపీగో, లక్కీగా అనిపించే ఆ హాస్యపు చివరి మలుపులో ఏ జీవన సత్యం దాగివుందో రచయితకి స్పష్టంగా తెలుసు. విషయం ఎంత చెప్పాలో అంతే చెబుతాడు. క్లాసులు పీక్కూడదనీ, ధర్మోపన్యాసాలు దంచకూడదనీ తెలిసినవాడు. చిన్న కథని నడిపించే టెక్నిక్ని ఒడిసిపట్టుకున్నవాడు. వాక్యాల్లో బిగువు, పట్టు, జవం, జీవం ఉంటాయి. మెరుపుల్లాంటి మాటలు, హ్యూమన్ బిహేవియర్ లోని అలసత్వాన్ని, అల్పత్వాన్ని పట్టుకుంటాడు. అంతరంగ చిత్రణ అనే పెద్ద గొడవని అలవోకగా సాధిస్తాడు. చివర...............