"కష్టాలు కలకాలం ఉండవు" అంటారు పెద్దలు. నిజమే. కానీ సుఖాలు కూడా కలకాలం ఉండవు. కష్టం - సుఖం - కష్టం - సుఖం - అదే జీవితం.
శాశ్వత, తాత్కాలిక అని కష్టాలు రెండు రకాలు...! ఒక మనిషి ఆజన్మాంతం కష్టాల్లో మునిగి తేలుతూ ఉంటే వాటిని శాశ్వత కష్టాలు అంటారు. అవి మళ్ళీ రెండు రకాలు.
• ఆర్ధిక.
• అనారోగ్య.
ఆరోగ్యానికి సంబంధించిన కష్టాల్లో 'సగం' మన చేతిలో లేనివి. ఆర్థిక కష్టాలు మాత్రం చాలా వరకూ మన చేతిలో ఉన్నవే..! వాటిని ఎలా డీల్ చెయ్యాలో చెప్పేదే ఈ పుస్తకం..!
నిరాశలో ఉన్న మనిషిని ఉత్తేజ పరచటానికి 'తరలి రాదా తనే వసంతం' అన్నాడు. మిత్రుడు సిరివెన్నెల. అదే సిరివెన్నెల స్వర్ణకమలం సినిమాలో "... వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా.. ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా" అని కూడా అన్నాడు.
ఒక వసంతం వెళ్లగానే మరో వసంతం వచ్చేయ్యటానికి జీవితం గిర్రున తిరిగే పూల చక్రం కాదు. వసంతం తరువాత గ్రీష్మమూ, వర్షమూ, ఆపై హేమంతమూ వస్తాయి.
మరో వసంతం వచ్చే వరకూ తట్టుకుని నిలబడటం ఆశావాదం. జీవితమంతా గ్రీష్మమని అనుకోవటం నిరాశావాదం. వసంతం వస్తుంది కదా అని పని చెయ్యకుండా కూర్చోవటం బద్ధకం. వసంతం కోసం ఎదురు చూడకుండా వర్తమానంలో పని చెయ్యటం కర్తవ్యం.
వసంతం వెళ్ళగానే వచ్చేది గ్రీష్మం..! ఆ ఎదురు దెబ్బల ఎండ వేడిమికి 'కోరిక' ఆవిరై పోకుండా కాపాడుకోవాలి.
ఆ తరువాత వచ్చేది తొలకరి..! కలల ప్రాంగణంలో ఆరేసిన ఆశల తివాచీని నిరాశ జల్లు తడపకుండా చూసుకోవాలి.........................