మరణం 15, జనవరి
కనుపూరు వెంకట రమణారెడ్డి, 1928 మార్చి 23న నెల్లూరు జిల్లా, కోవూరు తాలూకా, రేబాల గ్రామంలో జన్మించాడు. (జననం 23, మార్చి 1927 1998 జీవితకాలం 71 సంవత్సరాలు). విప్లవ రచయితల సంఘంతో పాటు, అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి బాధ్యతలు చేపట్టాక, తన పేరులో కులాన్ని సూచించే రెడ్డి పదాన్ని తొలగించి 'కెవిఆర్'గా ప్రసిద్ధుడయ్యాడు. రేబాల సుభిక్షమైన ఊరు. పెన్నానది. ఆనకట్టకింద మాగాణి భూమి. క్రమం తప్పకుండా పండే పంటలు. ప్రధానంగా వరి పండే సంపన్నమైన గ్రామం. గ్రామ సముదాయంలో వుండే అన్నికులాలూ వున్నా, సింహభాగం పంటరెడ్లు. వ్యవసాయం ప్రధాన జీవిక.
రమణారెడ్డి ఇంటి పేరు కనుపూరు. తల్లి కామమ్మ, తండ్రి చెంచురామిరెడ్డి, ముగ్గురు బిడ్డలు చనిపోగా, మిగిలిన వారిలో కెవియార్ పెద్ద. వస్తుతః సంపన్న కుటుంబం. భూవసతి, బంగారం వుండినా, కాలక్రమంలో చాలవరకు కోల్పోయి సామాన్య ఆర్థిక స్థాయికి కుటుంబం
చేరుకుంది.
బాల్యం నుండి ఫక్తు పల్లె వాతావరణంలో పుట్టి పెరిగిన రమణారెడ్డి మస్తిష్కంలో ఊహలు, భావనలు సృజనాత్మకత రేఖామాత్రంగా వుండేవని, ఆయన తన బాల్యాన్ని నెమరువేసుకొన్న ఆలోచనల్లో వ్యక్తమవుతూంది. "మగతనిదర తెరల్లో ఆకాశం నా కళ్ళముందు తన గారడీ పనులు... మా వూళ్ళో మబ్బుల్ని... అదే పనిగా చూస్తుండేవాణ్ణి. ఎన్నెన్ని రూపాలు కనిపించేవో చెప్పటం ఇప్పట్లో శక్తికి మించిన పని, పక్షులూ, మృగాలూ, చిత్రవిచిత్ర మానవ ఆకృతులూ, ఎప్పటికప్పుడు మారుతూ కదిలిపోయే, అచ్చు తెల్లటి, తేలిక నలుపు కలిసిన తెల్లటి మబ్బులు చూపించినట్టే చూపించి, ఇంతలో మంత్రం వేసినట్టు మాయమయేవి. పిండారబోసిన గుమ్మడి పూత వెన్నెల్లో, జల్తారు మబ్బుల్లో, మసక చందమామ దూరి తీరా బయటపడడానికి ఎంతోకాలం తీసుకునేవాడు". ఇలా సాగేవి ఆయన ఊహలు చిన్నతనంలో!............