ఈ పుస్తకం ఎందుకు రాశాను?
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనేది ప్రమాదకర, విచ్ఛిన్నకర భావజాలాన్ని సమాజంలో వ్యాపింపజేయడానికి ఏర్పడిన సంస్థ, భారత సమాజపు సరస్సులో అది ఒక విష ప్రవాహపు పాయ, భారత సమాజ వృక్షానికి పట్టిన చీడ అనే అభిప్రాయాలు చిన్నప్పటి నుంచీ, దాదాపు యాబై ఏళ్లుగా చదువుతూ, వింటూ, మాట్లాడుతూ, అక్కడక్కడ రాస్తూ ఉన్నప్పటికీ, దాని మీద ఒక పూర్తి పుస్తకమే రాస్తానని, రాయవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.
కాని నూరేళ్లుగా చాపకింద విషంలా వ్యాపించిన ఆర్ఎస్ఎస్, దాని పరివారం గత పది సంవత్సరాలుగా అధికార పీఠం ఎక్కి దేశంలో సాగిస్తున్న బీభత్సం చూస్తూ. ఆ కాషాయ విష విద్వేష ప్రమాదాన్ని ప్రతి ఒక్కరి దృష్టికీ తేవడం, సంఘ్ పరివార్ పట్ల ప్రతిఘటన ఆలోచనలను సమీకరించడం ఒక ఆలోచనాపరుడిగా నా బాధ్యత అని గుర్తించినందువల్ల ఈ పుస్తకం రాయక తప్పలేదు. భారత సమాజపు బహుళత్వాన్ని, సహనాన్ని, సహజీవనాన్ని గౌరవించే చరిత్ర విద్యార్థిగా కూడ ఈ పుస్తక రచన నా బాధ్యత. ప్రస్తుత సమాజపు చెడుగులను నిర్మూలించి ఒక ఉన్నతమైన సమసమాజ దిశగా నడిపించాలనే లక్ష్యపు మార్గంలో ఒకానొక కార్యకర్తగా కూడా సంఘ్ పరివార్ తిరోగమన, అభివృద్ధి నిరోధక భావజాలాన్ని ప్రజలకు విప్పిచెప్పడం నా కర్తవ్యం.
ఇది హిందూ ధార్మిక ఆలోచనలను, ఆచార వ్యవహారాలను అమాయకంగా విశ్వసించే కోట్లాది మంది ప్రజల మీద విమర్శ ఎంతమాత్రమూ కాదు. ఆ అమాయకత్వాన్ని తమ స్వార్ధ రాజకీయాలకు వాడుకోదలచిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని పరివారంలోని వందలాది సంస్థల దుష్ట పన్నాగాల మీద వివరణా విమర్శా మాత్రమే.
అడుగు తీస్తే, అడుగు వేస్తే నిత్యమూ "శ్రీమన్నారాయణ" అంటూ ఉండే ఆస్తికుడైనప్పటికీ, తన ఇంట్లోనే భిన్నాభిప్రాయాలు, హేతువాద చర్చలు, తన ఆస్తికత్వం..................